బాలీవుడ్ శృంగార నటి సన్నీ లియోన్ కు కేరళలో ఎంత ఫాలోయింగ్ ఉందో ఒకప్పటి ఫోటోను బట్టి అర్థం చేసుకోవచ్చు. సన్నీ లియోన్ ను చూడడానికి వేల సంఖ్యలో కేరళ యువత రావడం కూడా అప్పట్లో నేషనల్ లెవెల్ న్యూస్ గా మారింది. అదే విధంగా సన్నీని ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఓ ఫంక్షన్ కు హాజరవ్వాలని కోరింది. కానీ ఆమె హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కేరళ హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది.
సన్నీ తమను మోసం చేసిందంటూ ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఆమెపై ఫిర్యాదు చేసింది. 2019లో కొచ్చిలో జరిగిన వేలంటైన్స్ డే ఫంక్షన్ లో పాల్గొంటానని సన్నీ తమ నుంచి రూ. 29 లక్షలు తీసుకుందని... కానీ, ఈవెంట్ కు ఆమె హాజరు కాలేదంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా సన్నీ లియోన్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. ఓ టీవీ షో కోసం తిరువనంతపురంకు ఇటీవల వచ్చిన సన్నీని పోలీసులు ప్రశ్నించారు. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని సన్నీ తెలిపింది. కేరళ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సన్నీని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది.