కంగనా రనౌత్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్.. ఎందుకింత కుట్ర అంటూ ఇంస్టాగ్రామ్ లో వీడియో

Kangana Ranaut Permanently Removed From Twitter. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేశారు.

By Medi Samrat  Published on  4 May 2021 9:20 AM GMT
Kangana Ranaut

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేశారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎన్నో ట్వీట్లను కంగనా రనౌత్ చేస్తూ ఉండేది. అటు సినిమాల గురించి, ఇటు రాజకీయాల గురించి ఎప్పుడు చూసినా వ్యాఖ్యలు చేస్తూ వస్తుండేది. ఇతర సోషల్ మీడియా అకౌంట్లలో పెద్దగా యాక్టివ్ గా ఉండని కంగనా ట్విట్టర్ లో మాత్రం ఎప్పటికప్పుడు ఫైర్ అవుతూ ఉండేది.

తాజాగా ట్విట్టర్ కంగనా రనౌత్ కు షాక్ ఇచ్చింది. ఆమె అకౌంట్‌ను సస్పెండ్‌ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వరుస ట్వీట్లు చేసింది కంగనా.. అందులో హింసాత్మక ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో ఆమె అకౌంట్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత తీవ్రస్థాయిలో హింస జరుగుతోందంటూ ఆమె పలు వీడియోలను, సందేశాలను అభిమానులతో పంచుకుంది. బెంగాల్ లో రాష్ట్రపతి పాలనకు ఆదేశించాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపడంతో ట్విటర్‌ ఆమె ఖాతాను నిలిపివేసింది.

తన ట్విట్టర్ ఖాతాను నిలిపివేయడం ప్రజాస్వామ్యాన్ని నిలువునా పాతిపెట్టడమేనని విమర్శించింది. కంగనా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో వీడియోను అప్లోడ్ చేసి.. ఏడుస్తూ బెంగాల్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయని తెలిపింది. బెంగాల్ లో అంత హింస జరుగుతూ ఉన్నా కూడా విదేశీ మీడియా కనీసం రిపోర్టింగ్ ఇవ్వడం లేదని.. ఇది హిందువులపై జరుగుతున్న కుట్ర అంటూ కంగనా చెప్పుకొచ్చింది.
Next Story
Share it