మంచి మనసున్న చందమామ.. విద్యార్థిని ఖాతాకు లక్ష రూపాయలు..!
Kajal Helps To Fan. టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ ఓ విద్యార్థిని చదువు కోసం తన సొంత డబ్బులు ఇచ్చింది.
By Medi Samrat Published on 4 April 2021 5:03 PM ISTటాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ చేసిన ఓ మంచి పని ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆమె ఓ విద్యార్థిని చదువు కోసం తన సొంత డబ్బులు ఇచ్చింది. హైదారాబాద్‌కు చెందిన ఎం ఫార్మసీ విద్యార్థిని సుమ తన కాలేజీ ఫీజును చెల్లించాలని ట్విటర్ ద్వారా కాజల్ అగర్వాల్ ను కోరింది. తాను ఇటీవలే ఉద్యోగం పోగొట్టుకున్నానని చెప్పిన సుమ, ఎం ఫార్మసీ ఎగ్జామినేషన్ కు వెళ్లాలంటే రూ.83,000 చెల్లించాల్సి ఉందని చెప్పింది. ఈ విషయం కాజల్ దాకా వెళ్ళింది. ఎంతో మంచి మనసుతో కాజల్ అగర్వాల్ తన వంతుగా సాయం చేయడానికి ముందుకు వచ్చింది. తన ప్రతినిధి సాయంతో ఆ విద్యార్థినికి సాయం చేయాలని భావించింది.
కాజల్ ప్రతినిధి సుమను సంప్రదించి ఆమె ఖాతాకు రూ. 1 లక్ష రూపాయలు పంపించారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం తెలిసి పలువురు అభిమానులు కాజల్ చేసిన సాయాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ఆర్థిక భారంతో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థిని సుమకు కాజల్ చేసిన సాయం మరువలేదని.. మన చందమామకు ఎంతో మంచి మనసు ఉందని చెబుతూ ఉన్నారు. కాజల్ అగర్వాల్ నటించిన మోసగాళ్లు సినిమా ఇటీవలే ఫ్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తోంది కాజల్. మరిన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో కూడా కాజల్ బిజీగా ఉంది.