అందుకే ఎక్కువగా తిరుమలకు వెళ్తుంటా: హీరోయిన్ జాన్వీకపూర్

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీకపూర్‌.. తరచూ తిరుమలకు రావడానికి కారణాలను తెలిపింది.

By Srikanth Gundamalla  Published on  27 May 2024 1:57 PM IST
janhvi Kapoor,   Tirumala, Bollywood,

అందుకే ఎక్కువగా తిరుమలకు వెళ్తుంటా: హీరోయిన్ జాన్వీకపూర్ 

శ్రీదేవి కూతురుగా వెండితెరకు పరిచయం అయిన జాన్వీకపూర్.. తక్కువ సమయంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకుంది. అద్భుతమైన నటనతో హిట్‌లను అదుకుంది. ఇప్పటి వరకు బాలీవుడ్‌లోనే వరుసపెట్టి సినిమాలు తీసింది. ఇక త్వరలోనే టాలీవుడ్‌లోకి కూడా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే.. తరచూ జాన్వీకపూర్‌ తిరుమలకు వస్తుంటారు. సినిమా విడుదలకు ముందు, పుట్టిన రోజు, కొన్ని ప్రత్యేక తేదీల్లో జాన్వీ తిరుమల దర్శనంచేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీకపూర్‌.. తరచూ తిరుమలకు రావడానికి కారణాలను తెలిపింది.

తన తల్లి శ్రీదేవి మరణం తర్వాత తన అలవాట్లను చాలా వరకు మార్చుకున్నానని జాన్వీకపూర్ చెప్పింది. తన తల్లి చాలా విషయాలను బాగా విశ్వసించేవారని చెప్పింది. ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని పనులు చేయడానికి నిరాకరించేదని వెల్లడించింది. శుక్రవారం జుట్టు కత్తిరించకపోవడం నుంచి పలు విషయాలను బాగా పట్టించుకునేది అని జాన్వీ వివరించింది. అయితే.. ముందుగా వాటన్నింటినీ మూఢనమ్మకాలని తానూ కొట్టిపారేదాన్నని చెప్పింది. ఒక్కసారి అమ్మ దూరం అయ్యాక తాను కూడా ఆవిడ నమ్మకాలను నమ్మడం మొదలుపెట్టానని జాన్వీ తెలిపింది. నిజానికి ఆమె కంటే కాస్త ఎక్కువగానే విశ్వస్తున్నానని అన్నారు. శ్రీదేవి ఎక్కువగా తిరుమల శ్రీవారి పేరుని తలస్తూ ఉండేదని చెప్పింది జాన్వి. షూటింగ్‌లో గ్యాప్‌ దొరికినా కూడా ఆయన నామస్మరణే చేస్తుండేదని చెప్పింది. అందుకే ప్రతి ఏడాది పుట్టినరోజున స్వామిని దర్వించుకునేదని జాన్వీకపూర్ చెప్పింది.

ఇక అమ్మ దూరం అయిన తర్వాత తాను కూడా ఆమె పుట్టినరోజున తిరుమలకు రావాలని నిర్ణయం తీసుకున్నానని జాన్వి చెప్పింది. ఇక తిరుమలకు తాను వచ్చిన ప్రతిసారి ప్రశాంతంగా అనిపిస్తుందని చెప్పింది. అందుకే తరచూ తిరుమలకు వెళ్తుంటానని శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ చెప్పింది.

జాన్వీ సినిమా విషయానికి వస్తే.. మిస్టర్ అండ్‌ మిసెస్‌ మహి సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. క్రికెట్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. దాంతో.. జాన్వీకపూర్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.

Next Story