పరువు నష్టం కేసు: జీవిత, రాజశేఖర్‌కు జైలుశిక్ష
పరువు నష్టం కేసులో సినీ నటులు డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులకు రెండేండ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
By అంజి Published on 19 July 2023 1:16 AMపరువు నష్టం కేసు: జీవిత, రాజశేఖర్‌కు జైలుశిక్ష
పరువు నష్టం కేసులో సినీ నటులు డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకు జైలు శిక్ష విధిస్తూ మంగళవారం నాడు నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ తీర్పు వెల్లడించారు. అలాగే వారికి రూ.5 వేలు జరిమానా విధించారు. 2011లో రాజశేఖర్ తన భార్య జీవితతో కలిసి మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తోన్న బ్లడ్ బ్యాంక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు అభిమానుల నుంచి రక్తాన్ని ఉచితంగా సేకరించి బయట మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై రాజశేఖర్ దంపతులు మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్ట్ సేవలపై అసత్య ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం దావా వేశారు. 2011లో వారి ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సీడీ రూపంలో కోర్టుకు అందించారు. దీనిపై కోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించింది. పిదప రాజశేఖర్, జీవితకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో వారిద్దరు బెయిల్ బాండ్ల రూపంలో పూచీకత్తులను సమర్పించి కోర్టు నుంచి విడుదలయ్యారు.