మెగాస్టార్ చిరుకు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డ్
IFFI 2022.. Chiranjeevi named Indian Film Personality of the Year. మెగాస్టార్ చిరంజీవి ఐఎఫ్‌ఎఫ్‌ఐ 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యారు.
By అంజి Published on 21 Nov 2022 9:47 AM ISTమెగాస్టార్ చిరంజీవి ఐఎఫ్‌ఎఫ్‌ఐ 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యారు. చిరంజీవికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం ప్రకటించారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 53వ ఎడిషన్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా.. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన, ప్రభావంతమైన నటుల్లో ఒకరిగా మెగాస్టార్ చిరంజీవిని పరిగణిస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ అవార్డుకు ఎంపిక కావడంతో చిరంజీవికి పలువురు ప్రముఖులు, అభిమానులు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో, చిరంజీవి ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో 150కి పైగా చిత్రాలలో నటించారు. హిందీ, తమిళం, కన్నడ సినిమాల్లో కూడా చేశారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అంతకుముందు ''నటుడిగా, డ్యాన్సర్‌గా, నిర్మాతగా 150 చిత్రాలతో పాటు 4 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌ను చిరంజీవి కలిగి ఉన్నారు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన ప్రదర్శనలతో తెలుగు సినిమాల్లో ఆయన విపరీతమైన ప్రజాదరణ పొందారు.'' అని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.
తల్లిదండ్రులు చిరంజీవికి శివశంకర్ వర ప్రసాద్ అని పేరు పెట్టారు. హనుమంతుడిపై అపారమైన విశ్వాసం ఉన్నందున, సినిమాల్లోకి వచ్చినప్పటి నుండి ఆయనను చిరంజీవి అని పిలుస్తున్నారు. చిరంజీవి 1982లో 'ఇంట్లో రామయ్య వీధీలో కృష్ణయ్య' సినిమాలో తన నటనతో ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడు. ఇటీవల 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవిత తనదైన శైలి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 2006లో భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారతదేశం మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో సత్కరించారు.
వహీదా రెహమాన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ బచ్చన్, సలీం ఖాన్, బిస్వజిత్ ఛటర్జీ, హేమా మాలిని, ప్రసూన్ జోషి వంటి ప్రముఖులు గతంలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించబడ్డారు.