ప్రముఖ తెలుగు నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సూపర్ స్టార్ కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొద్దిసేపటి క్రితం సీఎం కేసీఆర్ కృష్ణ నివాసానికి వెళ్లారు. కృష్ణ పార్థివదేహంపై తెలంగాణ సీఎం పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. దివంగత కృష్ణ తనయుడు మహేష్ బాబును సీఎం కేసీఆర్ కౌగిలించుకుని ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులను కలుసుకుని తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
కృష్ణ.. ఈరోజు మన మధ్య లేకుండా పోవడమనేది చాలా బాధాకరమైన విషయమని కేసీఆర్ అన్నారు. సూపర్ స్టార్ కృష్ణకు ఘనంగా నివాళులర్పించిన అనంతరం సీఎం కేసీఆర్ తన సన్నిహితుడిని కోల్పోయారని పేర్కొన్నారు. ప్రముఖ నటుల్లో ఒకరిని కోల్పోవడం బాధాకరమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కృష్ణతో ఉన్న తన స్నేహా బంధాన్ని వెల్లడిస్తూ.. కృష్ణ ముక్కుసూటి వ్యక్తినని చెప్పుకొచ్చారు. దివంగత నటుడు కృష్ణ బహుముఖ ప్రదర్శకుడని, స్ఫూర్తిదాయకమైన దేశభక్తి చిత్రం "అల్లూరి సీతారామరాజు"లో అద్భుతమైన పాత్రను పోషించారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. పార్లమెంటు సభ్యులుగా దేశానికి సేవ చేశారని కొనియాడారు. మరోవైపు ప్రభుత్వ అధికారిక ప్రోటోకాల్ ప్రకారం కృష్ణా అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.