హీరో నాగ‌చైత‌న్య కారుకు ట్రాఫిక్ పోలీసుల ఫైన్‌

Hyderabad Traffic Police fined Actor Naga Chaitanya.నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 April 2022 9:16 AM IST
హీరో నాగ‌చైత‌న్య కారుకు ట్రాఫిక్ పోలీసుల ఫైన్‌

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు త‌మ‌కు ఎవ‌రైనా ఒక‌టేన‌ని అంటున్నారు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు ట్రాఫిక్ పోలీసులు జ‌రిమానా విధించారు. చై కారుకు బ్లాక్‌ ఫిలిం ఉండటంతో జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు సోమవారం అతడి కారును ఆపారు. రూ.700 జరిమానా విధించారు. కాగా.. ట్రాఫిక్ పోలీసులు చ‌లాన్ రాసిన స‌మ‌యంలో హీరో నాగ చైత‌న్య కారులోనే ఉన్న‌ట్లు స‌మాచారం.

వై కాటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్‌ ఫిలిం ఉపయోగించరాదని సుప్రీం కోర్టు స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ‌త కొద్ది రోజులుగా అద్దాల‌కు బ్లాక్ ఫిలిం ఉన్న కార్ల‌ను ఆపి జ‌రిమానాలు విధిస్తున్నారు.ఇటీవ‌ల యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్‌, మంచు మనోజ్‌ కార్ల అద్దాలకు బ్లాక్‌ ఫిల్ములను తొలగించి మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘన కింద వారికి రూ.700 చొప్పున చలాన్లు విధించిన విషయం తెలిసిందే.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. నాగ చైత‌న్య ఇటీవ‌ల 'బంగార్రాజు' చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. సంక్రాంతికి వ‌చ్చిన ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు విక్ర‌య్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చైతు స‌ర‌స‌న రాశి ఖ‌న్నా న‌టిస్తోంది. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు జ‌రుపుకుంటోంది.

Next Story