'లవ్ ఫెయిల్యూర్', 'జండాపై కపిరాజు', 'ఇద్దరమ్మాయితో' వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అమలా పాల్. దశాబ్ద కాలంగా కథానాయికగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఆమె కెరీర్‌లో తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసింది. 2011 నుంచి 2015 మధ్య కాలంలో కేవలం నాలుగు సినిమాల్లోనే కనిపించింది.. తాజాగా అమలా పాల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాను తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేయడానికి గల కారణాలను అమలా పాల్ మీడియాతో పంచుకుంది. ''తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగానే ఇండస్ట్రీ కొన్ని కుటుంబాల చేతుల్లో ఉందని.. ఆ కుటుంబాలు మాత్రమే ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నాయని.. వారు తీసే సినిమాలు కూడా భిన్నంగా ఉండేవని, వారి ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉండేవారు. వారిని గ్లామరస్ గా చూపిస్తూ లవ్ సీన్స్, పాటలకు మాత్రమే పరిమితం చేసేవారు. అందుకే తెలుగు ఇండస్ట్రీకి దగ్గరవ్వలేకపోయాను. చాలా తక్కువ సినిమాలే చేశాను" అని అమలా పాల్ చెప్పింది.
నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన 'పిట్ట కథలు' అనే తెలుగు వెబ్ సిరీస్‌లో చివరిగా నటించింది. తమిళ సినిమాతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించడం అదృష్టమని అమలా పాల్ చెప్పింది. "సినిమా నిర్మాతలు కొత్తవారి కోసం వెతుకుతున్న సమయంలో నేను కోలీవుడ్‌కి వచ్చాను. ఏడాది పాటు ఆడిషన్లు, మీటింగ్‌లు ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కెరీర్ ప్రారంభంలో రెండు సినిమాలు చేశాను. అవి ఇంకా విడుదల కాలేదు." అని చెప్పారు.
తన మూడో సినిమా 'మైనా' విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యాను. 'మైనా' తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నానని, అందుకే పెద్ద స్టార్స్‌తో కూడా పనిచేశానని చెప్పింది. తాజాగా అమలా పాల్ 'శవ' చిత్రంలో నటించింది. ఈ చిత్రం నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలైంది.