విరాట్‌ కోహ్లీ బయోపిక్.. హీరో రామ్‌ పోతినేని ఏమన్నారో తెలుసా?

ఈ నెల 28న విడుదల కానున్న 'స్కంద' సినిమా కోసం మాస్ హీరో రామ్ పోతినేనితో పాటు ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By అంజి  Published on  24 Sept 2023 11:00 AM IST
Ram Pothineni, Virat Kohli, Skanda , Tollywood

విరాట్‌ కోహ్లీ బయోపిక్.. హీరో రామ్‌ పోతినేని ఏమన్నారో తెలుసా?

ఈ నెల 28న విడుదల కానున్న 'స్కంద' సినిమా కోసం మాస్ హీరో రామ్ పోతినేనితో పాటు ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్‌ యాక్షన్‌తో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా రిలీజ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో రామ్‌ పోతినేని ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'స్కంద' తాజా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా రామ్‌ని బాలీవుడ్‌ ఇంటర్వ్యూయర్ సంకేత్ మాత్రే ఇంటర్వ్యూ చేశారు. రామ్, సంకేత్ మధ్య మాటల మధ్యలో విరాట్ కోహ్లీ ప్రస్తావన వచ్చింది. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోలికలపై, కోహ్లీ బయోపిక్ చేసే అవకాశం గురించి రామ్‌ని సంకేత్‌ అడిగాడు.

మీరు విరాట్ కోహ్లీలా ఉన్నారని సోషల్ మీడియాలో చాలా మంది చెబుతూ ఉంటారు. ఒకవేళ ఆయన బయోపిక్ చేసే అవకాశం వస్తే?' అని సంకేత్ అడిగాడు. దీనికి రామ్‌ సమాధానం ఇస్తూ.. “అవును, కోహ్లికి నాకు పోలిక ఉందని చాలా మంది చెప్పారు. నేను 'ఇస్మార్ట్ శంకర్' లుక్ ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. అప్పటి నుంచి విరాట్ కోహ్లీతో కంపేరిజన్ మొదలైంది. నాకు ఆఫర్ వస్తే అతని బయోపిక్ చేయాలనుకుంటున్నాను. విరాట్‌ బయోపిక్‌ అంటే ఎగ్జైటింగ్‌గా ఉంటుంది” అని రామ్ చెప్పారు. క్రికెట్ నేర్చుకుంటానని కూడా తెలిపారు.

ఇదిలా ఉంటే.. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‍పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. స్కంద సినిమా రన్ టైమ్ 176 నిమిషాలట. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. ప్రిన్స్ సిసిల్ విలన్‍గా చేశాడని టాక్. తెలుగులో ఐటమ్ క్వీన్‍గా మారిన ఊర్వశి రౌతెలా స్కందలో కల్ట్ మామ పాటకు స్టెప్పులేసింది.

Next Story