దీపావళి పండగ పూట సినీ నటుడు రాజశేఖర్ ఇంట విషాదం నెలకొంది. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గురువారం సాయంత్రం ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. వరదరాజన్ చెన్నై డీఎస్పీగా పనిచేసి రిటైర్ అయ్యారు.
ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమారైలు. కాగా.. రాజశేఖర్ ఆయనకు రెండో సంతానం. వరదరాజన్ భౌతికకాయాన్ని నేడు చెన్నై తరలించనున్నారు. అక్కడే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక 2017లోనే రాజశేఖర్ తల్లి ఆండాళ్ వరదరాజన్ మరణించారు.
ఇదిలా ఉంటే.. రాజశేఖర్ ప్రస్తుతం 'శేఖర్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మలయాళ చిత్రం 'జోసెఫ్' కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. లలిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ మూవీలో అను సితార, మస్కన్ కథానాయికలు.