దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)' చిత్రం అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటింది. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ సహా పలు అంతర్జాతీయ అవార్డులు అవార్డులు అందుకున్న ఈ చిత్రం తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డును తన ఖాతాలో వేసుకుంది. హాలీవుడ్‌లో ఎంతో గొప్పదిగా భావించే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవార్డుల్లో పలు అవార్డులు ఈ చిత్రానికి దక్కాయి.
'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం', 'బెస్ట్ స్టంట్స్', 'బెస్ట్ యాక్షన్ ఫిలిం', 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్(నాటు నాటు)', ఇలా పలు కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొని రాజమౌళి, కీరవాణి, రామ్‌చరణ్ లు ఈ అవార్డులను అందుకున్నారు.
ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ.. నాటు నాటుకు ఈ అవార్డును అందించిన హెచ్‌సీఏకి ధన్యవాదాలు. ఇలాంటి గొప్ప గౌరవాన్ని నాకు సొంతం అయ్యేలా చేసిన రాజమౌళికి కృతజ్ఞతలు అని చెబుతూ పాట పాడారు.
దాదాపు 600 మంది బృందంతో కొన్ని సార్లు రెండు వేల మంది కంటే ఎక్కువ మంది ఆర్టిస్టులతో ఈ సినిమా రూపొందించామని, ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ రాజమౌళి అన్నారు.