గబ్బర్ సింగ్ కు 9 ఏళ్లు..
Gabbar Singh movie completes 9 years.గబ్బర్ సింగ్ సినిమా విడుదలై నేటికి(మే 11) 9 ఏళ్లు పూర్తి చేసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 11 May 2021 2:36 AM GMT'ఖుషి' సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మళ్లీ అలాంటి సినిమా రాలేదు. దాదాపు పదేళ్ల పాటు ఒక్క హిట్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. పదేళ్ల విరామం తరువాత 'గబ్బర్ సింగ్' చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బండ్ల గణేష్ నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ నటించింది. ఈ సినిమా విడుదలై నేటికి(మే 11) 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు మీ కోసం..
బాలీవుడ్‌లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన 'దబాంగ్' హక్కులను కొనుగోలు చేసిన నిర్మాత బండ్ల గణేష్ తన సొంత బ్యానర్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై రూ.30కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాడు. 2012 మే 11న విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే రికార్డులు బద్దలు కొడుతూ.. మొత్తంగా రూ.150కోట్లు వసూలు చేసి పెట్టింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ పుల్ డైలాగ్స్, భారీ యాక్షన్ సీన్స్, పవన్ మేనరిజం, కబడ్డీ, అంతాక్షరి ఇలా ప్రతి ఒక్కటి ఫ్యాన్స్ ని అలరించాయి. 'నా కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది'. 'అరె ఓ సాంబ రాసుకోరా'.. 'నేను చెప్పినా ఒకటే నా ఫ్యాన్స్ చెప్పిన ఒకటే'.. 'నేను ట్రెండ్ ఫాలో కాను ట్రెండ్ సెట్ చేస్తా'.. 'కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు' వంటి డైలాగ్‌లు ఫ్యాన్స్‌ను థియేటర్ల వైపు పరుగులు పెట్టించాయి.
'షాక్' , 'మిరపకాయ్' లాంటి కేవలం రెండు సినిమాలు డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ పిలిచి మరి ఆఫర్ ఇచ్చాడు. ఓ డైరెక్టర్ గా కాకుండా ఒక ఫ్యాన్ తన అభిమాన హీరోని ఎలా చూడాలి అనుకుంటున్నాడో అలా సినిమాను తెరకెక్కించి అందరి చేత శభాష్ అనిపించాడు హరీష్. ఇక దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులకు కిక్కెక్కించాయి.