డిప్రెషన్ కారణంగా ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా కన్నడ నటి, బిగ్ బాస్ కన్నడ మాజీ కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య బలవన్మరణానికి పాల్పడ్డారు. బెంగళూరులోని ప్రగతి లేఔట్ మగడి రోడ్‌లో ఉన్న వృద్ధాశ్రమంలో ఉరి వేసుకుని జయశ్రీ రామయ్య ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం (జనవరి 25న) మధ్యాహ్నం జయశ్రీ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.
నిజానికి తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు ఇప్పటికే జయశ్రీ వెల్లడించారు. గతేడాది జులై 22న జయశ్రీ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ''నేను వెళ్లిపోతున్నా. ఈ ఫ*గ్ వరల్డ్, డిప్రెషన్‌కి గుడ్‌బై'' అని పోస్ట్‌లో జయశ్రీ తాను డిప్రెషన్ కు గురయ్యానని ఒప్పుకుంది. కానీ ఇప్పుడు ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
జులై 25న జయశ్రీ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా 'లైవ్' లో మాట్లాడుతూ తాను ఇదంతా పబ్లిసిటీ కోసం చేయడం లేదని స్పష్టం చేశారు. కన్నడ బిగ్ బాస్ హోస్ట్ అయిన కిచ్చా సుదీప్ నుంచి తాను ఎలాంటి ఆర్థిక సహాయం ఆశించడం లేదని.. ఆర్థికంగా తాను చాలా బలంగా ఉన్నానని అన్నారు. కాకపోతే డిప్రెషన్‌తో బాధపడుతున్నానని.. తనకు వ్యక్తిగత సమస్యలు చాలానే ఉన్నాయన్నారు. జయశ్రీ బలవన్మరణానికి పాల్పడటం కన్నడ సినీ పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. జయశ్రీ మృతి పట్ల చాలా మంది సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.