జోధా అక్బర్ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం..
Fire accident in jodhaa akbar Movie set.బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ జంటగా నటించిన చిత్రం
By తోట వంశీ కుమార్ Published on 8 May 2021 7:46 AM ISTబాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ జంటగా నటించిన చిత్రం 'జోధా అక్చర్'. 2008లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 2007లో ఈ చిత్రం కోసం ఎన్‌డీ ఫిల్మ్ స్టూడియోలో శాశ్వత సెట్‌ను నిర్మించారు. కాగా.. శుక్రవారం ఎన్‌డీ ఫిల్మ్ స్టూడియోలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జోధా అక్భర్ సెట్ పూర్తిగా కాలి బూడిద అయ్యింది. అయితే.. అదృష్ట వశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లా ఖలాపూర్ సమీపంలో ఎన్‌డీ ఫిల్మ్ స్టూడియోలో 2007లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జోధా అక్బర్' చిత్రం కోసం బాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఓ శాశ్వత సెట్‌ని నిర్మించారు. సినిమా చిత్రీకరణ అనంరతం ఈ సెట్‌ను సందర్శకుల కోసం శాశ్వత సెట్‌గా మార్చేశారు. ఇక ఏక్తా కపూర్ నిర్మించిన బుల్లితెర చారిత్రక డ్రామా 'జోధా అక్బర్' సీరియల్ షూటింగ్ కూడా 2013- 2014 మధ్య ఇక్కడే చిత్రీకరించబడింది.
ప్రస్తుతం కరోనా కట్టడికి మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధించడంతో.. అక్కడ ఎటువంటి సినిమా లేదా సీరియల్ షూటింగ్‌లు జరగడం లేదు. కాగా.. శుక్రవారం ఈ సెట్‌లో ప్రమాద వశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో స్టూడియో మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే.. స్టూడియోలో ఉన్న ప్లైవుడ్, పీఓపీ, ఇతర సామాగ్రీ అగ్నికి ఆహుతి అయ్యాయి. పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పై నుంచి మంటలు స్టూడియో గోడలను తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.