చిరంజీవి సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం
ఆచార్య సినిమా కోసం కోకాపేట లేక్ వద్ద ధర్మస్థలి పేరుతో టెంపుల్ సెట్ ఏర్పాటు చేశారు. సెట్ మొత్తం మంటల్లో కాలిపోయింది.
By తోట వంశీ కుమార్ Published on 28 Feb 2023 9:13 AM ISTమెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌లు కలిసి నటించిన చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అభిమానులను అలరించలేకపోయింది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోని కోకాపేటలోని ఓ ఖాళీ స్థలంలో 20 ఎకరాల్లో ప్రత్యేక సెట్‌ను వేసిన సంగతి తెలిసిందే.
సినిమాకు ఎంతో కీలకమైన ధర్మస్థలి టెంపుల్ తో పాటు దాని చుట్టూ ఓ గ్రామంలా భారీ సెట్ ని వేశారు. ఈ సెట్ వేయడానికి దాదాపు రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అప్పట్లో చెప్పారు. సినిమా విడుదలైన తరువాత కూడా ఈ సెట్ ను తీయలేదు అలాగే ఉంచారు. సోమవారం రాత్రి ఒక్కసారిగా ఆ సెట్ లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సెట్‌లో చాలా భాగం మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. మంటలు ఎలా వ్యాపించాయి అన్నది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'బోళా శంకర్' చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.