భార్యను కారుతో ఢీ కొట్టిన బాలీవుడ్ సినీ నిర్మాత‌ క‌మ‌ల్ కిశోర్ మిశ్రా

Filmmaker Rams Wife With Car After She Accuses Him Of Cheating.నిర్మాత మ‌రో మ‌హిళ‌తో కారులో ఉండ‌గా అత‌డి భార్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2022 9:34 AM IST
భార్యను కారుతో ఢీ కొట్టిన బాలీవుడ్ సినీ నిర్మాత‌ క‌మ‌ల్ కిశోర్ మిశ్రా

ఓ బాలీవుడ్ సినీ నిర్మాత మ‌రో మ‌హిళ‌తో కారులో ఉండ‌గా అత‌డి భార్య ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించింది. అయితే.. ఆమెను గ‌మ‌నించిన అత‌డు కారును ముందుకు పోనిచ్చాడు. అడ్డుకునేందుకు య‌త్నించిన భార్య‌ను ఢీ కొట్టాడు. పశ్చిమ అంధేరిలోని నివాస భవనం పార్కింగ్ ప్రాంతంలో అక్టోబ‌ర్ 19న జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

అంబోలి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత క‌మ‌ల్ కిశోర్ మిశ్రా మ‌రో మ‌హిళ‌తో అంధేరిలోని నివాస భవనం పార్కింగ్ ప్రాంతంలో కారులో ఉన్నారు. అత‌డిని వెతుకుతూ ఆయ‌న భార్య అక్క‌డ‌కు వ‌చ్చింది. కారులో ఉన్న ఇద్ద‌రిని చూసింది. భ‌ర్త మ‌రో మ‌హిళ‌తో ఉండ‌డంతో నిల‌దీయ‌డానికి కారు వ‌ద్ద‌కు వెళ్లింది.

భార్య రావ‌డంతో కిశోర్ భ‌య‌ప‌డిపోయాడు. అక్క‌డి నుంచి త‌ప్పించుకునేందుకు య‌త్నించాడు. కారు దిగ‌మ‌ని ఆమె గ‌ట్టిగా అరుస్తూ కారు బ్యానెట్ పై కొట్ట‌సాగింది. అక్క‌డి నుంచి పారిపోయేందుకు అత‌డు కారును ముందుకు ప‌రుగులు పెట్టించాడు. దీంతో కారు ఆమెను ఢీ కొట్టి ముందుకు దూసుకుపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఆమెకు గాయాల‌య్యాయి.

దీనిపై ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. మిశ్రా తన కారుతో భార్య‌ను ఢీకొట్టడంతో ఆమె నేలపై పడిపోతున్న సంఘటన యొక్క సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతనిపై 279 (రాష్ డ్రైవింగ్) మరియు 337 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్యతో గాయపరచడం) సహా ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిందని పోలీసులు బుధ‌వారం తెలిపారు.

కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీ టీవీ పుటేజీ వైర‌ల్‌గా మారింది.

Next Story