చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్టు బండ్ల గణేష్‌కు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. బుధవారం నాడు ఒంగోలులోని జిల్లా కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఓ చెక్ బౌన్స్ కేసులో తీర్పు చెప్పింది. అలాగే రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని ఒంగోలు రెండో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ పి.భానుసాయి ఆదేశించారు. కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని ఆదేశించారు. 2019లో ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నుంచి గణేష్ రూ.95 లక్షలు తీసుకుని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున అదే మొత్తానికి చెక్కు ఇచ్చాడు.
వెంకటేశ్వర్లు ఆ చెక్‌ను నగదుగా మార్చుకునే నిమిత్తం బ్యాంకుకు తీసుకెళ్లగా ఖాతాలో నగదు లేకపోవడంతో అది కాస్తా బౌన్స్ అయ్యింది. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కేసును విచారించిన మేజిస్ట్రేట్ నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఏడాది జైలు శిక్ష, రూ.95.10 లక్షలు జరిమానా వేశారు. జరిమానాలోని రూ.95 లక్షలను ఫిర్యాదికి పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చారు. ఒక నెలలోపు అప్పీలుకు వెళ్లేందుకు గణేష్‌ను కోర్టు అనుమతించింది. గతంలో ఎర్రమంజిల్ కోర్టు కూడా బండ్ల గణేశ్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.