ఫ్యాన్స్ అత్యుత్సాహం.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లు ధ్వంసం
నిన్న రాత్రి బిగ్‌బాస్ ఫినాలే ముగిసిన అనంతరం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు.
By అంజి Published on 18 Dec 2023 6:27 AM IST
ఫ్యాన్స్ అత్యుత్సాహం.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లు ధ్వంసం
నిన్న రాత్రి బిగ్‌బాస్ ఫినాలే ముగిసిన అనంతరం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు. స్టూడియో నుంచి బయటికొచ్చే కార్లపై దాడిగి తెగబడ్డారు. తొలుత రన్నరప్ అమర్‌దీప్ కారు అద్ధాలను ధ్వంసం చేశారు. కాసేపటికే బయటికొచ్చిన ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్వినిశ్రీ, పాత సీజన్ కంటెస్టెంట్ గీతు రాయల్ వాహనాలపైనా దాడి చేశారు. బిగ్ బాస్ విజేత ప్రకటన తర్వాత రోడ్డుపై ఈ బీభత్సం జరిగింది. అంతకుముందు అటుగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టారు. డ్రైవర్ గాయపడ్డారు.
కొంత మంది యువకులు మద్యం మత్తులో నానా హంగామా చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. దీనిపై అశ్విని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తన కారు అద్దాలు పగిలిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ ఫ్యాన్స్ ఇంత దారుణంగా అద్దాలు పగలకొడితే ఏం చేయాలంటూ అశ్విని ఎమోషనల్ అయ్యింది. ఫ్యాన్స్ ప్రవర్తించిన తీరు చాలా గలీజ్‌గా ఉందంటూ అసహనం వ్యక్తం చేసింది. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచిన సెలబ్రేషన్స్‌లో ఉండగా.. హౌస్ బయట ఈ ఘటన జరిగింది.
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ నిలవగా.. రన్నరప్‌గా అమర్‌దీప్ నిలిచాడు. మొత్తం 105 రోజులు సాగిన ఈ ప్రయాణంలో పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. టైటిల్ దక్కించుకున్నందుకు పల్లవి ప్రశాంత్‌కు రూ.35 లక్షల నగదుతో పాటు, రూ.15 లక్షల విలువైన డైమండ్ జ్యుయలరీ, బ్రెజా కారు ఇచ్చారు.