అర్థ‌రాత్రి ఎన్టీఆర్ ఇంటి ముందు ఫ్యాన్స్ హంగామా.. పోలీసుల లాఠీ ఛార్జ్

Fans Hungama at JR NTR house in Midnight.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌కు ఈరోజు పండుగ రోజు. అభిమానులు ముద్దుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2022 3:50 AM GMT
అర్థ‌రాత్రి ఎన్టీఆర్ ఇంటి ముందు ఫ్యాన్స్ హంగామా.. పోలీసుల లాఠీ ఛార్జ్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌కు ఈరోజు పండుగ రోజు. అభిమానులు ముద్దుగా తార‌క్ అని పిలుచుకునే జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. నంద‌మూరి అంద‌గాడు శుక్ర‌వారం 39వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు, సెల‌బ్రెటీలు ఎన్టీఆర్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఆయ‌న ఇంటి వ‌ద్ద‌కు చేరుకున్నారు. అర్థ‌రాత్రి తార‌క్ ఇంటి వ‌ద్ద హ‌డావుడి చేశారు. భారీగా అభిమానులు రావ‌డంతో ఆ ప్రాంత‌మంతా ర‌ద్దీగా మారింది. ఎన్టీఆర్ ఇంటి ముందు కేట్ చేశారు. జై ఎన్టీఆర్ నినాదాల‌తో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. కొంద‌రు బాణా సంచా కాల్చ‌గా.. మ‌రికొంద‌రు రోడ్డుపైనే డ్యాన్సులు చేశారు.

అయితే.. కేక్ క‌ట్ చేసే విష‌యంలో అభిమానుల మ‌ధ్య చిన్న‌పాటి గొడ‌వ జ‌రిగింది. వెంట‌నే పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అభిమానుల‌ను అక్క‌డి నుంచి వెళ్లాల‌ని పోలీసులు సూచించారు. అయితే.. కొంద‌రు మాట విన‌లేదు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి అభిమానులను చెద‌ర‌గొట్టారు.

మరోవైపు.. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈచిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకంపై మిక్కిలినేని సుధాక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. #NTR30 సినిమా కి సంబంధించిన డైలాగ్ ని రిలీజ్ చేసారు. "అప్పుడ‌ప్పుడు ధైర్యానికి కూడా తెలీదు..అవ‌స‌రానికి మించి త‌ను ఉండ‌కూడ‌ద‌ని..అప్పుడు భ‌యానికి తెలియాలి.. త‌ను రావాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని.. వ‌స్తున్నా "అంటూ టీజ‌ర్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. కాగా.. వ‌చ్చే నెల‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

Next Story
Share it