బాలయ్య గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.. నందమూరి బాలకృష్ణ. ఎందుకంటే.. ఆయన పేరు అభిమానుల స్లోగన్ కాబట్టి.
By అంజి Published on 10 Jun 2024 11:45 AM ISTబాలయ్య గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.. నందమూరి బాలకృష్ణ. ఎందుకంటే.. ఆయన పేరు అభిమానుల స్లోగన్ కాబట్టి. తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, తెలుగు సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన ఘనత బాలయ్యకే దక్కుతుంది. 14 ఏళ్లకే తెరంగేట్రం చేసిన బాలయ్య.. నాలుగు దశబ్దాలకుపైగా ఇండస్ట్రీలో దుమ్ములేపుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ సినిమాలతో బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతున్నారు. తెరమీద, తెర వెనుక శ్లోకాలు, పద్యాలను ఆవలీలగా చెప్పగలిగే అరుదైన తెలుగు నటుల్లో బాలకృష్ణ ఒకరు. నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా.. ఈ నటసింహ గురించి కొన్ని విశేషాలు..
ఈ విషయాలు తెలుసా..
- ప్రస్తుతం ఉన్న నటుల్లో పౌరాణిక, జానపదం, సాంఘిక, సైన్స్ ఫిక్షన్.. ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన అగ్ర కథానాయకుడు బాలయ్య. చెంఘీజ్‌ఖాన్, గోన గన్నారెడ్డి పాత్రలో నటించాలనేది బాలయ్య బాబు చిరకాల కోరికట.
- బాలయ్య ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు. ఇప్పటి వరకు 17 సినిమాల్లో ఆయన డ్యూయెల్ రోల్ ప్లే చేశారు. తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి 10కిపైగా సినిమాల్లో నటించారు.
- లక్ష్మీనరసింహ స్వామి అంటే ఈ లెజెండ్‌కు అమితమైన భక్తి. అందుకే సింహా.. అనే పేరుతో తెరకెక్కిన చిత్రాలన్నీ సూపర్‌హిట్.
- బాలకృష్ణ.. తన తండ్రిలానే తెల్లవారుజామునే నిద్రలేచి, పూజ చేయనిదే ఎక్కడికీ వెళ్లరట. ఆదిత్య999 కథతో త్వరలో దర్శకుడిగా వ్యవహరించి, తన కల నెరవేర్చుకోనున్నారు.
అభిమాని కోసం.. ఫ్రెంచ్‌కట్ గెటప్
బాలయ్య హీరోగా తెరకెక్కిన 'రూలర్' సినిమాలో ఫ్రెంచ్‌కట్ గడ్డం లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఈ గెటప్ వెనుక ఓ ఆసక్తికర స్టోరీని ఓ సందర్భంలో పంచుకున్నారు బాలయ్య. అదేంటంటే.. హాలీవుడ్ స్టార్ స్టిల్‌ని ఓ అభిమాని ఆయనకు పంపాడు. 'మిమ్మల్ని ఈ గెటప్‌లో చూడాలని ఉంది' అని ఆ అభిమాని మనసులో మాట తెలుసుకున్న బాలకృష్ణ.. రూలర్ కోసం విభిన్న గెటప్పులు వేయాలనే ప్రస్తావనరాగా దర్శకుడికి ఫ్రెంచ్‌కట్ గురించి చెప్పారు. దీన్ని బట్టి బాలయ్య తన అనభిమానులను ఎంతగా ప్రేమిస్తారో అర్థం చేసుకోవచ్చు. వెండితెరపైనే కాదు.. తన రాజకీయ జీవితంలోనూ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారీ నందమూరి నటసింహం.