టాలీవుడ్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో యువ దర్శకుడు పైడి రమేష్ కన్నుమూత
Director Pydi Ramesh Passed away.టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సినీ పరిశ్రమలో దర్శకుడిగా ఓ మంచి గుర్తింపు
By తోట వంశీ కుమార్ Published on 29 April 2022 8:19 AM ISTటాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సినీ పరిశ్రమలో దర్శకుడిగా ఓ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్న ఓ యువ డైరెక్టర్ ప్రమాద వశాత్తు కన్నుమూశాడు. బట్టలు తీసే క్రమంలో కరెంట్ షాక్ కొట్టడంతో నాలుగో అంతస్తు నుంచి కింద పడి మరణించాడు.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. యూసఫ్‌గూడలోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న పైడి రమేష్ అనే దర్శకుడు 2018లో 'రూల్' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. నూతన నటీ నటులతో తెరకెక్కించిన ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే.. ఈ సారి మరో కథతో ఎలా అయినా సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. అందులో భాగంగానే రెండో సినిమాకి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
అపార్టుమెంట్‌లో నాలుగో అంతస్తులో నివాసం ఉంటున్న రమేష్ నిన్న సాయంత్రం వాకింగ్‌కు వెళ్లి వచ్చాడు. అదే సమయంలో వర్షం వస్తుండడంతో బాల్కానీలో ఆరేసిన బట్టలు తీస్తుండగా.. గాలికి కొన్ని దుస్తులు పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడ్డాయి. ఆ బట్టలను రాడ్ సాయంతో తీసేందుకు రమేష్ ప్రయత్నించగా.. కరెంట్ షాక్‌కు గురైయ్యాడు. దీంతో నాలుగో అంతస్తు నుంచి కింద పడి మరణించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఓ వర్ధమాన దర్శకుడు ఇలా అకస్మాత్తుగా మరణించాడు అని తెలుసుకున్న సినీ ప్రముఖులు, టెక్నీషన్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నారు.