టాలీవుడ్‌లో విషాదం.. ఫిట్స్‌తో ప్రముఖ దర్శకుడు కన్నుమూత
Director KS Nageswara Rao passed away.టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు
By తోట వంశీ కుమార్ Published on 27 Nov 2021 9:45 AM ISTటాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు కన్నుమూశారు. శుక్రవారం సొంతూరు నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఆయనకు ఫిట్స్ వచ్చాయి. తరువాత కొద్దిసేపటికే ఆయన తుదిశ్వాస విడిచారు. నాగేశ్వరరావుకు భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు. ఆయన ఇక లేరనే వార్త విని సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు 'గుడుంబా శంకర్' చిత్ర దర్శకుడు వీరశంకర్ కూడా ధృవీకరించారు. నిన్న ఊరు నుంచి కారులో నాగేశ్వరరావు హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో కోదాడ సమీపంలోకి రాగానే ఆయనకు ఫిట్స్ వచ్చాయన్నారు. వెంటనే ఆయన్ను కోదాడలోని రెండు, మూడు ఆస్పత్రులకు తరలించినా ప్రయోజనం లేకపోవడంతో.. నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. అయితే.. అప్పటికే ఆయన మతి చెందారన్నారు. నాగేశ్వరరావు అంత్యక్రియలను నేడు ఆయన అత్తగారి ఊరైన ఊరైన నల్లజర్ల దగ్గరలోని కౌలూరు గ్రామంలో నిర్వహించనున్నారు.
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దగ్గర అసిస్టెంట్‌గా సినీ పరిశ్రమలో నాగేశ్వరరావు కెరీర్‌ను ప్రారంభించారు. 1986 నుంచి పరిశ్రమలో ఉన్న ఆయన.. కృష్ణంరాజు, జయసుధ జంటగా నటించిన 'రిక్షా రుద్రయ్య' చిత్రంలో దర్శకుడిగా మారారు. రియల్ స్టార్ శ్రీహరిని హీరోగా పరియం చేస్తూ.. 'పోలీస్' అనే సినిమా తీశారు. 'శ్రీశైలం', 'దేశద్రోహి' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలని బావించి 'బిచ్చగాడు' నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఇటీవలే ఆ చిత్రాన్ని ప్రారంభించారు. అయితే.. ఇంకా సినిమా పూర్తికాకముందే ఆయన ఈ లోకాన్ని విడిచివెళ్లారు.