రూ.100 కోట్ల క్లబ్‌లో 'సార్‌'.. విద్యార్థులకు ఫ్రీగా మూవీ చూసే ఛాన్స్‌

విద్యా హక్కును చాటిచెప్పే 'సార్‌' సినిమాను పిల్లలకు ఉచితంగా ప్రదర్శించాలని సితార సంస్థ నిర్ణయించుకుంది.

By అంజి  Published on  5 March 2023 2:15 PM IST
Dhanush, Sir Movie, Students

రూ.100 కోట్ల క్లబ్‌లో 'సార్‌'.. విద్యార్థులకు ఫ్రీగా మూవీ చూసే ఛాన్స్‌

ఇటీవల విడుదలైన ధనుష్ నటించిన 'సార్‌' సినిమా సూపర్‌ హిట్టైంది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ శనివారం సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలైంది. తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. 'సార్‌' సినిమా అనేది 90వ దశకంలో జరిగిన ఒక పీరియాడికల్ సోషల్ డ్రామా. ఈ చిత్రంలో సంస్థల ప్రైవేటీకరణ వల్ల భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థను సరిదిద్దే లక్ష్యంతో ధనుష్ జూనియర్ ప్రొఫెసర్‌గా నటించాడు. ధనుష్‌తో పాటు ఈ చిత్రంలో సంయుక్త మీనన్‌, సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ల భరణి, తోటపల్లి మధు, ఆడుకలం నరేన్, కెన్ కరుణాస్, ఇళవరసు తదితరులు నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్. ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ హక్కును నెట్‌ఫ్లిక్స్ చేజిక్కించుకుంది.

చదువు ఎవరిసొత్తు కాదని, అది అందరీ హక్కు అని తెలియజేసే విధంగా రూపొందిన ఈ మూవీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. విద్యా హక్కును చాటిచెప్పే ఈ మూవీని విద్యార్థులకు ఫ్రీగా చూపించాలని సితార సంస్థ నిర్ణయించుకుంది. ''విద్యా హక్కుపై అందరిలో అవగాహన కల్పించడమే 'సార్' మూవీ ప్రధాన లక్ష్యం. మా సినిమాను పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించాలని మేం కోరుకుంటున్నాం. మీరు చేయాల్సిందల్లా contact@sitharaents.com ఐడీకి మెయిల్ చేయడమే. మీరు మెయిల్ చేస్తే మా టీమ్ మిమ్మల్ని సంప్రదించి షో ఖరారు చేస్తుంది'' ఈ సినిమా నిర్మాత నాగవంశీ ట్వీట్‌ చేశారు. ఇటీవలే ఖమ్మంలోని స్కూల్‌ విద్యార్థులు తమకు 'సార్‌' మూవీ ఉచితంగా చూపించాలంటూ ధర్నాకు కూడా దిగారు.

Next Story