వకీల్ సాబ్ బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరణ.. థియేటర్ల వద్ద ఉద్రిక్తత..!
Denies permission for vakeel saab premier shows.వకీల్‌సాబ్ చిత్రానికి ప్రీమియర్ షోలకు అనుమతి లేదని, టికెట్ల ధరల పెంపునూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 9 April 2021 4:09 AM GMTమూడేళ్ల తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ చిత్రం నేడు విడుదలకానుంది. ఈ చిత్ర విడుదల కోసం అభిమానులు ఎంతో ఎదురుచూశారు. ఇప్పటికే ఈ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. కొత్త చిత్రాల విడుదల సమయంలో వారం రోజుల వరకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంది. ప్రముఖ హీరోల చిత్రాలకు ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించే అవకాశమూ ఉంది. అయితే.. శుక్రవారం వకీల్‌సాబ్ చిత్రం విడుదలకు మొత్తం రంగం సిద్ధమైంది. అన్ని చిత్రాల మాదిరిగానే దీనికీ ప్రీమియర్ షో, ధరల పెంపునకు అనుమతి ఉంటుందని ఎగ్జిబిటర్లు భావించారు. కొంతమంది ఏడో తేదీన ప్రీమియర్ షోల టికెట్లను పలు థియేటర్లలో విక్రయించారు.
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత ఓ ప్రకటన విడుదల చేశారు. వకీల్‌సాబ్ చిత్రానికి ప్రీమియర్ షోలకు అనుమతి లేదని, టికెట్ల ధరల పెంపునూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎక్కడా అధిక ధరలకు టికెట్లు విక్రయించి, ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై కొంత మంది ఫ్యాన్స్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన నితిన్ చిత్రం 'రంగ్ దే'కు టికెట్ ధరలను పెంపును అనుమతించిన రాష్ట్రప్రభుత్వం.. వకీల్‌సాబ్ చిత్రానికి అడ్డంకులు ఎందుకు పెడుతోందన్నారు.
తిరుపతిలోని థియేటర్ల వద్ద ఉద్రిక్తత..
తిరుపతిలోని థియేటర్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. వకీల్ సాబ్ ఫ్యాన్స్ షోను సినిమా హాల్లు ప్రదర్శించలేదు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రదర్శించాల్సిన సాధారణ షోలను సైతం నిలిపివేయాలని థియేటర్ల యాజమాన్యానికి నోటీసులు జారీ అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటల షోకు బుక్ చేసుకున్న టికెట్ల డబ్బులను తిరిగి ఇచ్చేస్తుంది థియేటర్ యాజమాన్యం. దీంతో ఆగ్రహం చెందిన ప్రేక్షకులు థియేటర్ పై రాళ్ళ దాడి చేశారు. ఈ ఘటనలో ఓ థియేటర్ అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి
నిడదవోలులో ఎమ్మెల్యే ఇంటి ఎదుట..
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఇంటి ఎదుట పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. వకీల్ సాబ్ సినిమా కోసం అభిమానులు బెనిఫిట్ షో టికెట్లు కొన్నారు. కానీ థియేటర్‌లో బెనిపిట్ షో వేయకపోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు.