ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూమారుడు అకిరా నందన్‌కు ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన చిత్రం తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ నందన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నందన్ ముఖ కవళికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని AI మార్ఫింగ్ డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించారని పిటిషన్ దాఖలు చేశారు. AI సినిమాతో పాటు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్‌లలో పెద్ద సంఖ్యలో నకిలీ ప్రొఫైల్ సోషల్ మీడియా పేజీలను తొలగించాలని కోర్టుకు తెలిపారు.
కాగా పిటిషనర్ తరపు వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఏఐ లవ్‌స్టోరీ సినిమాను నిషేధించింది. కృత్రిమ మేధస్సు, డీప్‌ఫేక్ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అకిరా నందన్ పేరు, ఇమేజ్, పోలిక, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించడం దోపిడీ చేయడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. అతని ప్రతిష్టకు భంగం కలిగించే వక్రీకరించిన కంటెంట్‌ను రూపొందించడం ద్వారా అతని గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంది. కాగా అకిరానందన్ పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాలు తొలగించాలని, ఐపీ వివరాలను బహిర్గతం చేయాలని మెటా, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ సంస్థలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.