నేడు నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి కుటుంబం..కేసు ఏంటంటే?
టాలీవుడ్ ప్రొడ్యూసర్ సురేశ్ బాబు, సినీ నటులు వెంకటేశ్, రానా, అభిరాం నేడు నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు.
By - Knakam Karthik |
నేడు నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి కుటుంబం..కేసు ఏంటంటే?
హైదరాబాద్: టాలీవుడ్ ప్రొడ్యూసర్ సురేశ్ బాబు, సినీ నటులు వెంకటేశ్, రానా, అభిరాం నేడు నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. దక్కన్ కిచెన్ హోటల్‌ను అక్రమంగా కూల్చి సామాగ్రిని దొంగిలించారని హోటల్ యజమాని నందకుమార్ 2024 జనవరిలో కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో వారిపై కేసు నమోదైంది. గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా వారు విచారణకు హాజరుకాలేదు. దీంతో వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు వారికి ఆల్టిమేటం జారీ చేసింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా పోలీస్, న్యాయ వ్యవస్థలను డబ్బు, పలుకుబడితో దగ్గుబాటి ఫ్యామిలీ నిర్వీర్యం చేస్తోందని ఫిర్యాదుదారు నందకుమార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీ ఇవాళ కోర్టు ఆదేశాలను పాటిస్తూ హాజరవుతారా? ఒక వేళ హాజరుకాకపోతే కోర్టు తీసుకునే తదుపరి చర్యలేంటి? దగ్గుబాటి ఫ్యామిలీ మళ్లీ తమ పలుకుబడితో కోర్టు ధిక్కరణకు గురవుతారా? అనేది ఆసక్తిగా మారింది.
ఈ నేపథ్యంలోనే సురేశ్ బాబు, వెంకటేశ్, రానా, అభిరామ్‌లు నేడు నాంపల్లి కోర్టులో వ్యక్తిగత బాండ్లను సమర్పించే అవకాశం ఉంది. అయితే గతంలో వ్యక్తిగత బాండ్లను దగ్గుబాటి కుటుంబం తరపున లాయర్లు సమర్పించగా..వాటిని కోర్టు తిరస్కరించి, ధిక్కరణ కింద వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఒక వేళ దగ్గుబాటి కుటుంబం స్వయంగా నేడు బాండ్లను సమర్పించకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ విధించే అవకాశం ఉంది.