శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులకు షాక్..రుణం మోసం కేసులో ఆధారాలు లభ్యం
రుణ మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా నిధుల మళ్లింపుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు కనుగొన్నారు.
By - Knakam Karthik |
శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులకు షాక్..రుణం మోసం కేసులో ఆధారాలు లభ్యం
రుణ మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా నిధుల మళ్లింపుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు కనుగొన్నారు. 2015లో నమోదైన రూ. 60 కోట్ల మోసం కేసులో వీరిద్దరూ కంపెనీ నిధులను పక్కదారి పట్టించినట్లు ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) ప్రాథమిక ఆధారాలను కనుగొంది. వారి సంస్థ 'బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్' కోసం తీసుకున్న రుణాలను ఇతర అనుబంధ కంపెనీలకు మళ్లించి సొంతానికి వాడుకున్నారని ఈవోడబ్ల్యూ వర్గాలు అనుమానిస్తున్నాయి.
వ్యాపారవేత్త దీపక్ కొఠారీకి చెందిన ఎన్‌బీఎఫ్‌సీ నుంచి 'బెస్ట్ డీల్ టీవీ' కోసం తీసుకున్న నిధులను దుర్వినియోగం చేసినట్లు ఈవోడబ్ల్యూ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నిధులను సత్యయుగ్ గోల్డ్, వయాన్ ఇండస్ట్రీస్, ఎసెన్షియల్ బల్క్ కమోడిటీస్ వంటి శిల్పా, కుంద్రాలకు సంబంధం ఉన్న ఇతర కంపెనీలకు మళ్లించారా అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు ఎక్కడికి వెళ్లింది? ఎలా ఖర్చు చేశారు? అనేవి కచ్చితంగా గుర్తించేందుకు థర్డ్-పార్టీ కన్సల్టెంట్ ద్వారా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఈఓడబ్ల్యూ నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రయాణాలు, ప్రసారాలు, వేర్‌హౌసింగ్, ఆఫీసు ఖర్చుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి డబ్బును పక్కదారి పట్టించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ కేసులో భాగంగా ఈవోడబ్ల్యూ అధికారులు ఇటీవల రాజ్ కుంద్రాను దాదాపు 5 గంటల పాటు విచారించారు. మొదట రూ. 60 కోట్లను అప్పుగా తీసుకున్నప్పటికీ, తర్వాత దానిని ఈక్విటీగా మార్చినట్లు కుంద్రా అధికారులకు తెలిపారు. ప్రచార కార్యక్రమాల కోసం రూ. 20 కోట్లు ఖర్చు చేశామని, బిపాషా బసు, నేహా ధూపియాలకు బ్రాండ్ ప్రమోషన్ల కోసం చెల్లింపులు జరిపామని, అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన ఆధారాలుగా సమర్పించారు.
అయితే, కుంద్రా వాదనలకు, నిధుల వినియోగానికి మధ్య తీవ్రమైన తేడాలు ఉన్నట్లు ఈవోడబ్ల్యూ గుర్తించింది. కంపెనీలో మెజారిటీ వాటాదారుగా ఉన్న శిల్పాశెట్టి, 'బెస్ట్ డీల్ టీవీ'కి ప్రచారం చేసినందుకు తన సొంత ఏజెన్సీ ద్వారా రూ. 15 కోట్లను ఫీజుగా తీసుకున్నారని, దానిని కంపెనీ ఖర్చుగా చూపారని అధికారులు కనుగొన్నారు.
మరోవైపు, ఫిర్యాదుదారుడి ఎన్‌బీఎఫ్‌సీకి ఈక్విటీ షేర్లు కేటాయించే ముందు ఎలాంటి వాల్యుయేషన్ జరపకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా తమ వ్యాపారం పూర్తిగా నష్టపోయిందని, అందుకే కంపెనీని మూసివేయాల్సి వచ్చిందని కుంద్రా తన వాదన వినిపిస్తున్నారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన ఈఓడబ్ల్యూ, త్వరలోనే కంపెనీ మాజీ ఉద్యోగుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయనుంది.