కాపీరైట్ ఫిర్యాదు.. 'బేబీ'ని చుట్టు ముట్టిన వివాదం

సాయి రాజేష్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ తెలుగు చిత్రం 'బేబీ' షార్ట్ ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ షిరిన్ శ్రీరామ్ దాఖలు చేసిన కాపీరైట్ ఫిర్యాదుతో న్యాయ పోరాటంలో చిక్కుకుంది.

By అంజి  Published on  11 Feb 2024 8:15 PM IST
Movie Controversy, Baby, copyright complaint, Tollywood

కాపీరైట్ ఫిర్యాదు.. 'బేబీ'ని చుట్టు ముట్టిన వివాదం

గత ఏడాది సాయి రాజేష్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ తెలుగు చిత్రం 'బేబీ' షార్ట్ ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ షిరిన్ శ్రీరామ్ దాఖలు చేసిన కాపీరైట్ ఫిర్యాదుతో న్యాయ పోరాటంలో చిక్కుకుంది. ఈ విషయంపై హైదరాబాద్‍లోని రాయ్‍దుర్గ్ పోలీస్ స్టేషన్‍లో శిరిన్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. తాను సాయిరాజేశ్‍కు గతంలోనే ఈ కథ చెప్పానని, దాన్ని కాపీ కొట్టి బేబీ తెరకెక్కించారని శ్రీరామ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. శ్రీరామ్ ఇదే విషయాన్ని షేర్ చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ రాశారు. 2023 జూలై 14న బేబీ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. బడ్జెట్ పరంగా చిన్న మూవీగా అడుగుపెట్టింది. అయితే, ఈ యూత్‍ఫుల్ ట్రయాంగిల్ లవ్ ఎమోనల్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అతని పోస్ట్ ఇలా ఉంది.. ''అందరికీ నమస్కారం, నా సినిమా కథ “ప్రేమించోద్దు”ని దొంగిలించి, ‘బేబీ’ అనే తెలుగు సినిమా తీయడానికి కుట్ర పన్నినందుకు, చివరకు మేము ఒక దర్శకుడు, ఇద్దరు నిర్మాతలపై క్రిమినల్ కేసు పెట్టామని మీకు తెలియజేయడానికి వచ్చాను. ఇది ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేస్తుంది. తెలుగు సినిమా చరిత్రలో ఇది అతిపెద్ద స్క్రిప్ట్ స్కామ్ అని త్వరలో అందరూ గ్రహిస్తారు. ‘ప్రేమించొద్దు’ అనే సినిమాకి దర్శకుడు, నిర్మాతని నేనే శిరీన్‌ శ్రీరామ్‌. ఇది టీనేజ్ జీవితం ఆధారంగా 5 భాషల్లో రూపొందిన పాన్-ఇండియా సినిమా. 2015లో 6 మంది రచయితల బృందం, నేను.. బస్తీకి చెందిన ఒక అమ్మాయి విభిన్న ఆర్థిక నేపథ్యాలు కలిగిన ఇద్దరు అబ్బాయిలతో ప్రేమలో పడిన కథను రాశాము. మేము ఈ కథను అదే సంవత్సరం తెలుగు సినిమా 'బేబీ (2023)' దర్శకుడికి చెప్పాము, అతను ఈ చిత్రాన్ని నిర్మిస్తాడనే భావనతో. 2015 అక్టోబర్ 20న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్‌లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయంలో నేను ఎస్‌కెఎన్‌కి నా 'టీన్ మూవీ స్టోరీ'ని వివరించాను. 2023లో ఆయన 'బేబీ' చిత్రాన్ని విడుదల చేశారు. గతంలో పేరున్న 'ప్రేమించొద్దు' (వర్కింగ్ టైటిల్: 'కన్న ప్లీజ్') యొక్క సవరించిన వెర్షన్. నేను ఎలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్స్ చేయడం లేదు కానీ వాస్తవాలను బయటపెడుతున్నాను. రామ మందిర సత్యం బయటకు రావడానికి 500 ఏళ్లు పట్టింది. కావున ప్రతి ఒక్కరు నిజానిజాలు తెలిసే వరకు వేచి ఉండవలసిందిగా కోరుతున్నాను. నన్ను సపోర్ట్ చేసిన వ్యక్తులందరికీ, న్యాయవాది నిఖిలేష్ తొగరికి ధన్యవాదాలు. దీనిపై పోలీసులు విచారణ జరుగుతోంది'' అని అన్నారు.

Next Story