ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలపై వివాదం నెలకొనగా.. ప్రభుత్వం ఓకమిటీని నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం ఉదయం ఆ కమిటీ సమావేశమైంది. వరుస సినిమాలు విడుదల కానున్న నేపధ్యంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని 13 మంది సభ్యులతో కూడిన కమిటీ భేటీ అయి.. టికెట్ ధరలు, సినిమా హాల్స్‌లో చిరు తిళ్ల ధరలు, భారీ బడ్జెట్ చిత్రాలకు సంబంధించిన టికెట్ ధరలపై చర్చించింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం పలువురు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ల ధరల వివాదంపై పరిష్కారం లభించినట్లు చెబుతున్నారు.
ఇరు వర్గాలు(ప్రజలు, సినీ పరిశ్రమ) ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇరు వర్గాలకు మేలు చేకూరేలా సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వానికి తాము ఓ నివేదికను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఎలాంటి ధరను నిర్ణయిస్తుందో వేచి చూడాలి. అతి త్వరలోనే టికెట్ ధరలపై ప్రభుత్వం నుంచి జీవో వస్తుందనుకుంటున్నాం. ప్రజలు, సినీ పరిశ్రమను సంతృప్తి పరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక ఐదో ఆట గురించి కూడా సమావేశంలో చర్చకు వచ్చిందన్నారు. రూ.100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాసు తెలిపారు.