విషాదం.. ప్రముఖ హాస్యనటుడు గిల్బర్ట్ గాట్‌ఫ్రైడ్ కన్నుమూత
Comedian Gilbert Gottfried dies at 67.చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఒకరి మరణాన్ని జీర్ణించుకోలేక
By తోట వంశీ కుమార్ Published on 13 April 2022 2:27 PM ISTచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఒకరి మరణాన్ని జీర్ణించుకోలేకముందే మరొకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రముఖ హాస్య నటుడు గిల్బర్ట్ గాట్‌ఫ్రైడ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిజేశారు. అతని గౌరవార్థం "నవ్వుతూ ఉండండి" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
"మా ప్రియమైన గిల్బర్ట్ గాట్‌ఫ్రైడ్ సుదీర్ఘ అనారోగ్యం(అరుదైన కండరాల వ్యాధి) తర్వాత మరణించినట్లు ప్రకటించడం మాకు చాలా బాధ కలిగించింది. కామెడీలో నిజమైన దిగ్గజ వాయిస్. గిల్బర్ట్ ఓ అద్భుతమైన భర్త, సోదరుడు, స్నేహితుడు మరియు తన ఇద్దరు చిన్నపిల్లలకు తండ్రి. ఈ రోజు మనందరికీ విచారకరమైన రోజు అయినప్పటికీ, దయచేసి గిల్బర్ట్ గౌరవార్థం వీలైనంత బిగ్గరగా నవ్వుతూ ఉండండి. ఇట్లు గాట్‌ఫ్రైడ్ కుటుంబం" అంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది.
అతడి మృతి పట్ల పలువురు సెలబ్రెటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. బ్రూక్లిన్‌లో జన్మించిన గాట్‌ఫ్రెడ్ న్యూయార్క్‌లో పెరిగారు. అన్నీ అంశాలపై కామెడీ చేయగల సత్తా కలిగిన వాడు కావడం.. అందరిలో అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇందుకు 2001లో న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో దాడులు జరిగి సుమారు మూడు వేల మంది చనిపోగా దాని మీద కూడా చమత్కారాలు పేల్చడం ఒక్క గాట్ ఫ్రైడ్‌కే చెల్లింది. యానిమేటెడ్ ఫిలిం అల్లా ఉద్దీన్‌లో చిలుక పాత్రకు ఆయన అందించిన వాయిస్.. అతడిని ఎంతో మందికి దగ్గర చేసింది.