డీప్ ఫేక్‌పై ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలి: చిరంజీవి

డీప్ ఫేక్‌పై ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలి..అని సినీనటుడు చిరంజీవి అన్నారు.

By -  Knakam Karthik
Published on : 31 Oct 2025 12:40 PM IST

Cinema New, Hyderabad, Chiranjeevi, Deepfake, Cyber Crime, Telangana Police

డీప్ ఫేక్‌పై ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలి: చిరంజీవి

హైదరాబాద్: డీప్ ఫేక్‌పై ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలి..అని సినీనటుడు చిరంజీవి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఏక్తా దివస్‌ 2కే రన్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అశ్లీల సైట్లలో తన డీప్‌ఫేక్‌ వీడియోలు రావడంపై స్పందిస్తూ.. టెక్నాలజీతో మంచితో పాటు చెడు కూడా పెరుగుతుంది. డీప్ ఫేక్‌పై ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ ప్రయత్నించడం అభినందనీయం. సామాన్యులకు డీప్ ఫేక్ నుండి రక్షణ లభించాలి..అని కోరారు.

డీప్‌ఫేక్‌ అనేది చాలా ప్రమాదకరమైనది. నా ఫొటోలను మార్ఫింగ్ చేసిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉంది. ప్రజలకు వారు అండగా నిలుస్తున్నారు" అని చిరంజీవి తెలిపారు.

పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలని, అయితే దానితో పాటు వచ్చే ముప్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. "డీప్‌ఫేక్‌, సైబర్ నేరాలకు ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ధైర్యంగా పోలీసులను ఆశ్రయించండి. ప్రభుత్వాలు ఈ సమస్యపై దృష్టి సారించి కఠినమైన చట్టాలు రూపొందించాలి" అని ఆయన విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు మాట్లాడుతూ, 560 సంస్థానాలను ఏకం చేసి దేశానికి 'వన్ నేషన్' అనే గొప్ప వరాన్ని అందించిన మహనీయుడు సర్దార్ పటేల్ అని చిరంజీవి కొనియాడారు. ఆయన దృఢ సంకల్పం, దార్శనికత అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

Next Story