చిరంజీవి ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. మీ రుణం ఈ జ‌న్మ‌లో తీర్చుకోలేనంటూ

Chiranjeevi On Completing 44 Years In The Film Industry.సెప్టెంబ‌ర్ 22 చిరంజీవి కెరీర్‌లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే రోజు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Sep 2022 2:23 AM GMT
చిరంజీవి ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. మీ రుణం ఈ జ‌న్మ‌లో తీర్చుకోలేనంటూ

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. ఓ న‌టుడిగా ఎంట్రీ ఇచ్చినా విల‌న్‌గా కూడా మెప్పించారు. అనంత‌రం హీరోగా మారి త‌న న‌ట‌న‌, డ్యాన్స్‌ల‌తో అభిమానుల గుండెల్లో మెగాస్టార్‌గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సెప్టెంబ‌ర్ 22 చిరంజీవి కెరీర్‌లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే ఆయ‌న కీల‌క పాత్ర‌లో న‌టించిన ప్రాణం ఖ‌రీదు చిత్రం విడుద‌లైన గురువారానికి 44 ఏళ్లు పూరైంది. ఈ సందర్భంగా మెగాస్టార్ సోష‌ల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

"మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా పుట్టిన రోజు ఈరోజు( 22 సెప్టెంబర్ 1978). ప్రాణం ఖరీదు ద్వారా ప్రాణం పోసి.. ప్రాణప్రదంగా..నా ఊపిరై.. నా గుండె చప్పుడై.. అన్నీ మీరే అయి 44 సంవత్సరాలు నన్ను నడిపించారు. నన్నింతగా ఆదరించిన ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఎప్పటికీ మీ చిరంజీవి" అంటూ చిరు ట్వీట్ చేశారు.

వాస్త‌వానికి చిరంజీవి హీరోగా న‌టించిన మొద‌టి చిత్రం 'పునాది రాళ్లు'. అయితే.. ఆ త‌రువాత న‌టించిన 'ప్రాణం ఖ‌రీదు' ముందుగా విడుద‌లైంది. శివ శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌ను చిరంజీవిగా ప్రేక్ష‌కుల‌ను ప‌రిచ‌యం చేసింది. ప్ర‌స్తుతం చిరంజీవి వ‌రుస చిత్రాల‌తో పుల్ బిజీగా ఉన్నారు. ఆయ‌న న‌టించిన 'గాడ్ ఫాద‌ర్' అక్టోబ‌ర్ 5న విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఇంకో వైపు మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో 'భోళాశంక‌ర్' చిత్రం, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రంలోనూ చిరంజీవి న‌టిస్తున్నారు. దానికి 'వాల్తేరు వీర‌య్య 'అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది.

Next Story
Share it