నీలాంటి చ‌క్క‌ని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం : చిరంజీవి

Chiranjeevi Is Proud Of Satya Dev's Performance In Acharya.విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు తెచ్చుకున్నాడు స‌త్య‌దేవ్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 April 2022 3:13 PM IST
నీలాంటి చ‌క్క‌ని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం : చిరంజీవి

విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు తెచ్చుకున్నాడు స‌త్య‌దేవ్‌. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'ఆచార్య' చిత్రంలో స‌త్య‌దేవ్ ఓ అతిథి పాత్ర పోషించారు. ఇక రేపు ఆచార్య చిత్రం విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స‌త్య‌దేవ్.. చిరంజీవి గురించి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు. దీనిపై మెగాస్టార్ స్పందిస్తూ స‌త్య‌దేవ్‌ను మెచ్చుకున్నారు.

'అన్నయ్యా.. నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈ రోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది' అని స‌త్యదేవ్ ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన చిరంజీవి స్పందిస్తూ.. 'డియర్ సత్య‌దేవ్ కృత‌జ్ఞ‌త‌లు. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం. ఆచార్య‌లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం. గాడ్ ఫాద‌ర్ సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం' అని చిరు తెలిపారు.

మ‌ల‌యాళీ రీమేక్‌గా సిద్ధ‌మ‌వుతోన్న 'గాడ్ ఫాద‌ర్' చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో స‌త్య‌దేశ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Next Story