ఉక్రెయిన్‌లో ఉండిపోయిన తెలుగు వైద్యుడు.. చిరంజీవి భావోద్వేగ ట్వీట్
Chiranjeevi emotional tweet for for Doctor Giri Kumar who stayed in Ukraine.ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన సైనిక దాడి
By తోట వంశీ కుమార్ Published on 10 March 2022 10:08 AM GMTఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన సైనిక దాడి కొనసాగుతూనే ఉంది. బాంబుల మోతతో ఉక్రెయిన్ దద్దరిల్లుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. అక్కడే ఉంటే ప్రాణాలు పోతాయనే భయంతో చాలా మంది ప్రజలు ఉక్రెయిన్ నుంచి పలు దేశాలకు వలస వెలుతున్నారు. భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగా పేరుతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది.
అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తణుకు పట్టణానికి చెందిన డాక్టర్ గిరికుమార్ మాత్రం తాను ఇండియాకు రాలేనని ఓ వీడియా ద్వారా వెల్లడించాడు. ఇందుకు ప్రధాన కారణం తాను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న జాగ్వార్, పాంథర్. ఒకవేళ వాటిని వదిలి తాను ఇండియాకు వస్తే అవి ఆకలితో చనిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకనే తాను వీటిని వదిలి రాలేనని ఆ వీడియోలో తెలిపాడు.
గిరికుమార్ వీడియో ఎందరి హృదయాలనో కదిలించింది. మూగ జీవాల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి అక్కడే ఉన్న ఆయనకు ఎంతో మంది హ్యాట్సాఫ్ చెపుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా కదిలిపోయారు. 'ప్రియమైన డాక్టర్ గిరికుమార్ పాటిల్.. నన్ను స్పూర్తిగా తీసుకుని మీరు జాగ్వర్, పాంథర్‌లను పెంచుకుంటున్నారని తెలిసి ఎంతో ఆనందం అనిపించింది. అయితే.. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉన్న భయానక పరిస్థితుల్లో.. ఇండియాకు రాకుండా.. వాటి కోసం అక్కడే ఉండిపోయావని తెలిసి నా హృదయం ద్రవిస్తోంది. మూగ జీవాల పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, ప్రశంసనీయం. ఈ కష్టకాలంలో మీరు అక్కడ క్షేమంగా, సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. పరిస్థితులు చక్కబడేవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు' అని చిరంజీవి ట్వీట్ చేశారు.