శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా.. విడుద‌ల‌కు ముందే వివాదం

ఛావా సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతోంది. శంభాజీ మహారాజ్ గా ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటించారు.

By Medi Samrat  Published on  27 Jan 2025 7:30 PM IST
శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా.. విడుద‌ల‌కు ముందే వివాదం

ఛావా సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతోంది. శంభాజీ మహారాజ్ గా ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటించారు. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. శంభాజీ మహారాజ్ తన భార్య మహారాణి యేసుబాయితో కలిసి డ్యాన్స్ చేయడాన్ని పలువురు తప్పుబట్టారు. అయితే ఈ సన్నివేశాలను తొలగిస్తామని ఛావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెలిపారు.

ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరేతో భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెలిపారు. మీడియాకు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, ఉటేకర్ ఇది కేవలం డ్యాన్స్ సీక్వెన్స్‌కు సంబంధించిన విషయమని తెలిపారు. మరాఠా రాజు గొప్పతనాన్ని తగ్గించేలా ఎలాంటి సన్నివేశాలు ఉండవని హామీ ఇచ్చారు.

ఛావాలో ప్రముఖ మరాఠా యోధుని పాత్రలో నటుడు విక్కీ కౌశల్ నటించారు. విక్కీ, రష్మిక మందన్న నటించిన డ్యాన్స్ సీక్వెన్స్‌ను సినిమా నుండి తొలగిస్తామని దర్శకుడు తెలిపారు. లెజిమ్ డ్యాన్స్ కంటే శంభాజీ మహారాజ్ చరిత్ర చాలా పెద్దది. అందుకే ఆ సన్నివేశాలను సినిమా నుంచి తొలగించబోతున్నామని చెప్పారు. చిత్రం షెడ్యూల్ ప్రకారం థియేటర్లలోకి వస్తుందని దర్శకుడు ధృవీకరించారు. రష్మిక, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, డియానా పెంటీ, దివ్యా దత్తా తదితరులు నటించిన ఛావా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

Next Story