నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఊహించని షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు, దక్షిణ భారత చలన చిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడు సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కేసు విచారణకు హాజరుకాకపోవడంతో చెన్నై జార్జిటౌన్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
వివరాల్లోకి వెళితే.. 2016లో సెల్వమణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అయిన అరుళ్ అన్బరసు కలిసి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో చేసిన కొన్ని వ్యాఖ్యలే ఇప్పుడీ పరిస్థితికి దారితీశాయి. ఆ ఇంటర్వ్యూలో ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోద్రా గురించి సెల్వమణి తన అభిప్రాయాలను చెప్పారు. అయితే.. అవి తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ఈ ఇద్దరిపైనా బోద్రా.. చెన్నై జార్జిటౌన్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. కేసు విచారణ కొనసాగుతుండగా.. మధ్యలోనే బోద్రా మరణించారు. బోద్రా కుమారుడు గగన్ బోద్రా ఈ కేసును కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే.. సెల్వమణి కాని, అరుళ్ అన్బరసులు కాని, వారి న్యాయవాదులు కాని హాజరవ్వలేదు. దీంతో న్యాయస్థానం ఈ ఇద్దరిపైనా బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.