కరోనా మహమ్మారి కారణంగా మూత పడిన థియేటర్లు తొమ్మిది నెలల అనంతరం తెరుచుకున్న సంగతి తెలిసిందే. అయితే.. కేవలం 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. దీంతో థియేటర్ల ఓనర్లు తాము నష్టాల పాలవుతున్నట్లు చెప్పారు. ప్రేక్షకులు కూడా ఇప్పుడిప్పుడే హాళ్లలో అడుగుపెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక సంక్రాంతికి విడుదలైన సినిమాలు కూడా కేవలం 50శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. దీంతో నిర్మాతలు సినిమా విడుదలపై ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. వందశాతం ఆక్యుపెన్సీతో నడుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని పలువురు నిర్మాతలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
వ్యాక్సిన్ పంపిణీ, కరోనా తగ్గుముఖం పడుతోన్న తరుణంలో థియేటర్ యాజమాన్యానికి చేయూతనందించే విధంగా 100శాతం ఆక్యుపెన్నీతో థియేటర్లు నడుపుకోవచ్చునని కేంద్రం చెప్పింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతులిచ్చింది. సినిమాలు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో 100 శాతం సీట్లను నింపుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది. అయితే.. కరోనా నియంత్రణలో భాగంగా గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆ మార్గదర్శకాలలో కేంద్రం స్పష్టంగా ఆదేశించింది. కేంద్రం అనుమతులు ఇవ్వడంతో.. ఫిబ్రవరి 1 నుంచి 100శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాలు ప్రదర్శించేందుకు థియేటర్ల ఓనర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.