రూ.60 కోట్లు మోసం చేశారు.. శిల్పా శెట్టి, ఆమె భర్తపై కేసు..!
ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తను రూ. 60 కోట్లకు పైగా మోసం చేశారనే ఆరోపణలపై నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా సహా మరొక వ్యక్తిపై కేసు నమోదైంది.
By Knakam Karthik
వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మోసం చేసినందుకు శిల్పా శెట్టి, భర్తపై కేసు
ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తను రూ. 60 కోట్లకు పైగా మోసం చేశారనే ఆరోపణలపై నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా సహా మరొక వ్యక్తిపై కేసు నమోదైంది. శిల్పా దంపతులకు చెందిన బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ఒప్పందంతో ముడిపడి ఉంది. పెట్టుబడి ఒప్పందానికి సంబంధించి రూ.60 కోట్లు మోసం చేశారని శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై దీపక్ కొఠారి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు జుహు పోలీసులు కేసు నమోదు చేశారు.
2015- 2023 వరకు ఓ వ్యాపార ఒప్పందం నిమిత్తం రూ.60.48 కోట్లు ఇచ్చానని, కానీ ఆ డబ్బును వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించుకున్నారని దీపక్ కొఠారి ఆరోపించారు. షాపింగ్ ప్లాట్‌ఫామ్ బెస్ట్ డీల్ టీవీకి వారు డైరెక్టర్లుగా ఉన్న సమయంలో దీపక్ ఒప్పందం చేసుకున్నారు. అప్పటికి ఆ కంపెనీలో 87 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నారు. 2016 ఏప్రిల్‌లో తనకు శిల్పా శెట్టి వ్యక్తిగత హామీ కూడా ఇచ్చారని దీపక్ తెలిపారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని, ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆ కంపెనీ దివాలా తీసిన విషయం తెలిసిందని చెప్పారు.
బాలీవుడ్ జంట మొదట్లో 12% వడ్డీకి రూ. 75 కోట్ల రుణం కోరారని కొఠారి పేర్కొన్నారు. తరువాత అధిక పన్నులను నివారించడానికి, నెలవారీ రాబడి మరియు అసలు తిరిగి చెల్లించే హామీతో నిధులను "పెట్టుబడి"గా మళ్లించమని ఆయనను ఒప్పించారు. హామీల తర్వాత, కొఠారి ఏప్రిల్ 2015లో షేర్ సబ్‌స్క్రిప్షన్ ఒప్పందం కింద రూ.31.95 కోట్లు బదిలీ చేశానని, ఆ తర్వాత సెప్టెంబర్ 2015లో సప్లిమెంటరీ ఒప్పందం కింద మరో రూ.28.53 కోట్లు బదిలీ చేశానని పేర్కొన్నారు. మొత్తం మొత్తాన్ని బెస్ట్ డీల్ టీవీ యొక్క HDFC బ్యాంక్ ఖాతాలకు జమ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.