'ఎమర్జెన్సీ' మూవీ రిలీజ్ మళ్లీ వాయిదా.. కంగనా ట్వీట్

కంగనా రనౌత్‌ తాజాగా నటించిన సినిమా 'ఎమర్జెన్సీ'. ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూనే వస్తోంది.

By Srikanth Gundamalla  Published on  6 Sept 2024 1:30 PM IST
ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ మళ్లీ వాయిదా.. కంగనా ట్వీట్

బాలీవుడ్‌ క్వీన్‌.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ తాజాగా నటించిన సినిమా 'ఎమర్జెన్సీ'. ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. తాజాగా ఈ సినిమా మళ్లీ వాయిదా పడినట్లు ప్రకటించింది కంగనా రనౌత్. కాగా.. ఎమర్జెన్సీ సినిమా భారత దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన విషయం తెలిసిందే. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. దేశంలో ఎమర్జెన్సీ విధింపు సహా ఇతర అంశాలను సినిమాగా తెరక్కెక్కించారు. ఈ సినిమా గతేడాది నవంబర్‌ 24వ తేదీనే విడుదల కావాల్సి ఉంది. కానీ.. అనుకోని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత కూడా ఈ సినిమా థియేటర్లకు వెళ్లలేదు. పలుమార్లు వాయిదా పడింది. ఈ నెల 6వ తేదీన విడుదల చేస్తామని చెప్పినా.. అది కుదరలేదు. దాంతో.. కంగనా రనౌత్‌ సినిమా వాయిదా గురించి ట్వీట్ చేశారు.

ఎమర్జెన్సీ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు కంగన శుక్రవారం ఉదయం ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. సెన్సార్‌ బోర్డ్‌ నుంచి సర్టిఫికెట్‌ రాలేదని తెలిపారు. దాని కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు నటి, ఎంపీ కంగనా రనౌత్. మరోసారి ఈ మూవీ వాయిదా పడటంతో కంగనా అభిమానులు నిరాశపడ్డారు. మరో కొత్త తేదీ కోసం వేచిచూస్తున్నారు. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. జీ స్టూడియోస్‌, మణికర్ణిక ఫిలిమ్స్‌ బ్యానర్లు ఈ మూవీని నిర్మించగా... మహిమా చౌదరి, మిలింద్‌ సోమన్‌, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

1972లో విధించిన ఎమర్జెన్సీ కాలంనాటి రాజకీయ పరిణామాలపై సినిమా ఉండబోతుంది. అయితే.. మూవీలో సిక్కుల మనోభావాలు దెబ్బతీలా ఈ సినిమా తీశారని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ఆరోపిస్తోంది. మరోవైపు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదని బోర్డు సూచించింది. సినిమాలో సెన్సిటివ్ కంటెంట్ ఉందని CBFC తెలిపింది. ఈ కారణాలతో ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ఇప్పటి వరకూ సర్టిఫికెట్‌ ఇవ్వలేదు. మరి సినిమాలో మార్పులు చేస్తారా..? లేదంటే గ్రీన్‌ సిగ్నల్ వచ్చే వరకూ చూస్తారా అనేది తెలియాలి. చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.



Next Story