బాలీవుడ్‌లో మరో విషాదం.. ఎంఎస్ ధోనీ చిత్రంలో నటించిన మరో నటుడు ఆత్మహత్య
Bollywood actor Sandeep Nahar ends his life.బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సందీప్ నహార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By తోట వంశీ కుమార్ Published on 16 Feb 2021 9:42 AM IST
బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురు నటులను కోల్పోయిన బాలీవుడు.. మరోసారి శోకసంద్రంలోకి వెళ్లిపోయింది. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' చిత్రంలో సహాయ పాత్ర పోషించిన సందీప్ నహార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి వయసు 32 సంవత్సరాలు మాత్రమే. ముంబై, గోర్‌గావ్ ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు అతడు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టాడు.
వ్యక్తిగత సమస్యలతో పాటు తన భార్య కాంచన్, అత్త రెండేళ్లుగా తీవ్ర వేదింపులు, బెదిరింపులకు గురిచేస్తున్నారని సూసైడ్ నోటులో పేర్కొన్నాడు. పరిస్థితులను ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే.. ఈ విషయంలో తన భార్యను నిందించవద్దని కోరాడు. తన మృతికి ఎవరూ బాధ్యులు కారని స్పష్టం చేశాడు. ఆత్మహత్యే సమస్యలకు పరిష్కారమని భావిస్తున్నట్లు తెలిపాడు. కాగా.. ఫేస్‌బుక్‌లో అతడి పోస్టు చూసిన వెంటనే స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆత్మహత్యను ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
సందీప్ నహార్ .. ఎంఎస్ ధోని చిత్రంలో సుశాంత్‌ను ఎంకరేజ్ చేసే పాత్రలో సిక్కు వ్యక్తిగా కనిపించి అలరించాడు. కాగా.. ఇదే చిత్రంలో నటించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గత ఏడాది అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. సుశాంత్ మరణం వెనుక ఉన్న మిస్టరీ చేధించేందుకు సీబీఐ కూడా రంగంలోకి దిగింది. అయితే సుశాంత్ మరణం మరచిపోకముందే ఆయన కో స్టార్ సందీప్ నహార్ ఆత్మహత్యకు పాల్పడడం బాలీవుడ్‌లో కలకలం రేపుతుంది.