లాక్‌డౌన్‌కాలంలో ఎంతో మంది వలసకార్మికులకు సహాయం చేయడంతో పాటు.. అడిగిన వారికి కాదనకుండా సేవ చేస్తూ రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్. అలాంటి వ్యక్తి నేరాలకు అలవాటు పడిన వ్యక్తి అని బాంబే హైకోర్టుకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బిఎంసి) తెలిపింది. నగర పరిధిలోని జుహూ ప్రాంతంలో సోనూ సూద్ నిర్మించుకున్న అనధికార కట్టడాలను తాము రెండు సార్లు కూల్చి వేశామని.. ఆయన పద్ధతిని మార్చుకోలేదని తన వివేదికలో వెల్లడించింది. సోనూసూద్ ఇటీవల హైకోర్టులో వేసిన అప్పీలు వ్యాజ్యానికి సమాధానంగా నగర పాలక సంస్థ మంగళవారం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది.
తమ అనుమతి లేకుండా ముంబైలోని జుహూ ప్రాంతంలోని ఆరు అంతస్తుల నివాస భవనాన్ని సోనూసూద్ హోటల్‌గా మార్చారనే బిఎంసీ ఆయనకు గతంలో నోటీసులు ఇచ్చింది. దీనిపై ముంబై హైకోర్టును ఇటీవల సోనూసూద్ ఆశ్రయించారు. ఆరు అంతస్తుల శక్తి సాగర్ బిల్డింగ్‌లో తాను ఎలాంటి అక్రమ, అనధికార నిర్మాణాలు చేపట్టలేదని ఆ పిటిషన్‌లో సోనూసూద్ పేర్కొన్నారు. 'పిటిషనర్ (సూద్) తన నివాసంలో బీఎంసీ అనుమతి తీసుకుని చేయాల్సిన ఎలాంటి మార్పులు చేపట్టలేదు. మహారాష్ట్ర రీజనల్ అండ్ టౌన్ ప్లానింగ్ (ఎంఆర్‌టీపీ) చట్టం అనుమతించిన మార్పులు మాత్రమే చేశారు' అని లాయర్ డీపీ సింగ్ పేర్కొన్నారు.
గత అక్టోబర్‌లో బీఎంసీ జారీ చేసిన నోటీసులు కొట్టి వేయాలని సోనూసూద్ తన పిటిషన్‌లో కోర్టును కోరారు. తనపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు తీసుకోకుండా తాత్కాలిక ఉపశమనం (ఇన్‌టర్మ్ రిలీఫ్) కలిగించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. గత ఏడాది బీఎంసీ నోటీసుపై సివిల్ కోర్టును సోనూసూద్ ఆశ్రయించారు. అయితే సివిల్ కోర్టు నుంచి ఆయనకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో ఆయన తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం బీఎంసీ అపిడవిట్‌ను దాఖలు చేసింది.