గుండెపోటుతో న‌టి, బీజేపీ నాయ‌కురాలు సోనాలి ఫోగ‌ట్ మృతి

BJP leader and Actress Sonali Phogat dies of heart attack in Goa.నటి సోనాలి ఫోగట్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Aug 2022 6:33 AM GMT
గుండెపోటుతో న‌టి, బీజేపీ నాయ‌కురాలు సోనాలి ఫోగ‌ట్ మృతి

నటి, హరియాణా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు సోనాలి ఫోగట్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వ‌య‌స్సు 42 సంవ‌త్స‌రాలు. స్నేహితుల‌తో క‌లిసి గోవా వెళ్లిన ఆమె సోమ‌వారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రీటీలు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

గోవా డీజీ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర గోవాలోని ఎస్టీ ఆంటోనీ ఆస్పత్రి నుంచి సోనాలి ఫోగట్ మృతి గురించి పోలీసులకు సమాచారం అందింది. మరణానికి గల కారణాలను ఇప్పుడే నిర్ధారించలేమని, విచారణ, పోస్ట్‌మార్టం తర్వాత కార‌ణం తెలుస్తుంద‌న్నారు.

టీవీ యాంక‌ర్‌, న‌టిగా 2006లో కెరీర్ ఆరంభించారు సోనాలి ఫోగట్. టిక్‌టాక్ ద్వారా ఆమె పాపులారిటీ మ‌రింత పెరిగింది. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 14వ సీజన్‌లో ఆమె కనిపించింది. వైల్డ్‌కార్డ్‌తో ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమెకు మ‌రింత గుర్తింపు వ‌చ్చింది. 2019 హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమె ఆదంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ నేత కుల్దీప్‌ బిష్ణోయ్‌ చేతిలో ఓట‌మిపాలైయ్యారు. కాగా.. అనూహ్యంగా కిందటి నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బిష్ణోయ్‌.. బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే.

ఫోగట్ తన మరణానికి కొన్ని గంటల ముందు తన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

హిస్సార్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కెప్టెన్ భూపేందర్ మాట్లాడుతూ.. "సోనాలి జీ గోవాలో ఉన్నారు. నేను ఆమె సహాయకుడితో మాట్లాడాను, ఆమె గుండెపోటుతో మరణించిందని అతను చెప్పాడు".అని అన్నారు.

ఫోగట్ మృతిపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వేదిక‌గా సంతాపం తెలిపారు. "బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ జీ ఆకస్మిక మరణం గురించి చాలా విచారకరమైన వార్త అందింది. ఆమె లేని లోటును భ‌రించే శ‌క్తి ఆమె కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌సాదించాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్న‌ట్లు" మనోహర్ లాల్ ఖట్టర్ ట్వీట్ చేశారు.

Next Story