భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్‌కు కొత్త డేట్ ఫిక్స్‌..!

Bheemla Nayak Pre Release Event New Date Fix.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అకాల మ‌ర‌ణంతో నిన్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Feb 2022 9:34 AM IST
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్‌కు కొత్త డేట్ ఫిక్స్‌..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అకాల మ‌ర‌ణంతో నిన్న (ఫిబ్ర‌వ‌రి 21) జ‌ర‌గాల్సిన 'భీమ్లానాయ‌క్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ నెల 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఈ నేప‌థ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించాలి అనుకున్నా.. వాయిదా ప‌డ‌డంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. అయితే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేక‌ర్స్ కొత్త డేట్ ఫిక్స్ చేసుకున్నార‌ని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈనెల 23న నిర్వహించేందుకు స‌న్నాహాకాలు చేస్తున్నారు. అయితే.. దీనిపై చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. ఈ వేడుక‌కు మంత్రులు కేటీఆర్, తలసాని కూడా హాజరుకానున్నారు.

మ‌ల‌యాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించ‌గా.. సాగర్‌.కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ న‌టిస్తున్నారు.

కాగా.. ఇప్ప‌టికే విడుద‌ల ఈ చిత్ర ట్రైల‌ర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. టాలీవుడ్‌లో అతివేగంగా 7 మిలియన్ వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా భీమ్లానాయక్ ట్రైలర్ రికార్డు సృష్టించింది. చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది.

Next Story