రీ రిలీజ్‌కి సిద్ధమైన 'భైరవద్వీపం'.. బాలయ్య ఫ్యాన్స్‌కు పండగే
ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమాలతో పాటు రీ రిలీజ్ సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
By అంజి Published on 26 July 2023 9:58 AM ISTరీ రిలీజ్‌కి సిద్ధమైన 'భైరవద్వీపం'.. బాలయ్య ఫ్యాన్స్‌కు పండగే
ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమాలతో పాటు రీ రిలీజ్ సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. స్టార్ హీరోలు అప్పట్లో నటించిన సినిమాలను 4కే క్వాలిటీతో మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ నటించిన 'నరసింహనాయుడు' సినిమాను రీ రిలీజ్ చేయగా.. మంచి కలెక్షన్లను రాబట్టింది. దీంతో బాలకృష్ణ నటించిన ఎవర్‌గ్రీన్ ఫాంటసీ క్లాసిక్ మూవీ 'భైరవద్వీపం' సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్టు మంగళవారం ప్రకటించారు. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 14 ఏప్రిల్ 1994న విడుదలై గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా క్లాప్స్ ఇన్ఫోటెన్‌మెంట్ సంస్థ పి.దేవ్‌తో కలిసి చంద్రశేఖర్ కుమారస్వామి ఈ క్లాసిక్ సినిమాను ఈ తరం ప్రేక్షకుల అందించేందుకు సిద్ధమయ్యారు.
ఇందు కోసం సినిమాకు సరికొత్త సొబగులు దిద్దారు. 4కె రిజల్యూషన్ క్వాలిటీతో ఆగస్టు 5న ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. రావికొండల రావు రచించిన ఈ మ్యూజికల్ లవ్‌స్టోరీకి మాధవపెద్ది సురేష్ మ్యూజిక్ అందించారు. ఈ పాటలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. ఈ జానపద సినిమాలో రోజా హీరోయిన్‌గా నటించింది. కైకాల సత్యనారాయణ, విజయ్‌కుమార్, రంభ, విజయ రంగరాజు తదితరులు ఈ సినిమాలో నటించారు. అప్పట్లో ఫాంటసీ మూవీల్లో భైరవ ద్వీపం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఏకంగా తొమ్మిది నంది అవార్డులను సొంతం చేసుకొని రికార్డులు కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌తో సంతోషంలో ఎగిరిగంతులేస్తున్నారు.