ప్రముఖ రంగ స్థల కళాకారుడు, బలగం సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయస్సు 65 సంవత్సరాలు. ఆయన మృతి చెందడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. జీవీ బాబు తెలుగు నాటక రంగానికి తన నిబద్ధతతో, నటనా ప్రతిభతో ఎంతో కృషి చేశారు.గ్రామీణ నాటకాల నుంచి సాంఘిక ప్రసంగాల వరకు ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు.
రెండేళ్ల క్రితం విడుదలైన ‘బలగం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియదర్శికి చిన్నతాత అంజన్నగా అద్భతంగా నటించారు జీవీ బాబు. జీవీ బాబు మృతి గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. జీవీ బాబు మరణంపై బలగం డైరెక్టర్ వేణు విచారం వ్యక్తం చేశారు. జీవీ బాబు జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారని, చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం తనకు దక్కిందని పేర్కొన్నారు. అయన ఆత్మ శాంతించాలి అని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.