60 ఏళ్ల వయస్సులో.. మళ్లీ పెళ్లి చేసుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి అస్సాంకు చెందిన రూపాలి బారువాతో మే 25, గురువారం ఒక సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నారు.
By అంజి Published on 26 May 2023 7:30 AM IST60 ఏళ్ల వయస్సులో.. మళ్లీ పెళ్లి చేసుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి అస్సాంకు చెందిన రూపాలి బారువాతో మే 25, గురువారం ఒక సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నారు. ఆశిష్ విద్యార్థి అనేక హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరిన్ని ప్రాంతీయ చిత్రాలలో కనిపించాడు. ఆశిష్ విద్యార్థి భార్య రూపాలి వ్యాపారవేత్త. ఆమె కోల్‌కతాలోని ఒక ఉన్నతస్థాయి ఫ్యాషన్ స్టోర్‌ని నడుపుతున్నారు. ఆశిష్, రూపాలి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిశ్శబ్దంగా రిజిస్ట్రీ వివాహం చేసుకున్నారు. ఆశిష్ విద్యార్థి, రూపాలి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడిచింది. మొదట్లో స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరు ప్రేమికులై, పెళ్లితో ఒక్కటయ్యారు.
ఈ పెళ్లి కంటే ముందు జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు గతంలో ఒకప్పటి నటి శకుంతల బారువా కుమార్తె రాజోషి బారువాను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వీరి దాంపత్యంలో కలతలు రావడంతో విడిపోయారు.
60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం గురించి తన భావాలను పంచుకున్నాడు ఆశిష్. ''నా జీవితంలో ఈ దశలో, రూపాలిని పెళ్లి చేసుకోవడం ఒక అసాధారణ అనుభూతి. ఉదయం కోర్ట్ మ్యారేజ్, సాయంత్రం గెట్ టు గెదర్'' అని ఆశిష్ తెలిపారు. ఈ వార్త అభిమానులను ఉర్రూతలూగించిన నేపథ్యంలో వీరిద్దరూ ఎలా కలిశారంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. "మేము కొంతకాలం క్రితం కలుసుకున్నాము. దానిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాము. కానీ మా పెళ్లి చిన్న కుటుంబ వ్యవహారంగా ఉండాలని మేమిద్దరం కోరుకున్నాము" అని తెలిపారు.
బాలీవుడ్‌లో విలన్ పాత్రలకు ప్రసిద్ది చెందిన ఆశిష్ విద్యార్థి భారతీయ చలనచిత్రంలో అనేక చిత్రాలలో పనిచేశారు. ఈ నటుడు జూన్ 19, 1962న ఢిల్లీలో జన్మించారు. 1986లో ప్రారంభమైన కెరీర్‌లో, ఆశిష్ విద్యార్థి అనేక హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, ఒడియా, మరాఠీ మరియు బెంగాలీ చిత్రాలలో కనిపించారు. అతను ఇప్పటివరకు 11 విభిన్న భాషలలో దాదాపు 300 చిత్రాల్లో నటించాడు.