బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి ఆశా పారేఖ్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 2020 సంవత్సరానికి గాను ఆశా ఫారేఖ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. సినిమా రంగంలో అత్యుత్తమ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. ఈ అవార్డుకు ఆశా ఫారేఖ్‌ను ఎంపిక చేస్తూ మంగళవారం కేంద్ర సమాచారం, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఈ అవార్డును నటికి సెప్టెంబర్ 30న అందజేయనున్నారు. ఆశా పారేఖ్ నటించిన 'దిల్ దేకే దేఖో', 'కాటి పతంగ్', 'తీస్రీ మంజిల్', 'కారవాన్' సినిమాలు అద్భుత విజయం సాధించాయి. ఈ సినిమాలతోనే ఆశ మంచి గుర్తింపు పొందారు. ఆశా పారేఖ్ నటిగానే కాక దర్శకురాలిగా, నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను 1992లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది.
హిందీ చిత్రాల చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నటులలో ఆశా పారేఖ్ ఒకరు. ఆశా పరేఖ్ బాలనటిగా సినిమాల్లోకి అడుగు పెట్టారు. ఆమె 10 సంవత్సరాల వయస్సులో 'మా' (1952)లో చిత్రనిర్మాత బిమల్ రాయ్ చేత నటించింది. కొన్ని సినిమాలు చేసిన తర్వాత తన విద్యను పూర్తి చేయడానికి విరామం తీసుకున్నారు. జబ్ ప్యార్ కిసీ సే హోతా హై (1961), ఫిర్ వోహీ దిల్ లయా హూన్ (1963), తీస్రీ మంజిల్ (1966), బహరోన్ కే సప్నే (1967), ప్యార్ కా మౌసం (1969), కారవాన్ (1971). రాజ్ ఖోస్లా యొక్క దో బదన్ (1966) వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆశా పరేఖ్ గుజరాతీ, పంజాబీ , కన్నడ చిత్రాలలో కూడా పనిచేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం. గతంలో రాజ్ కపూర్ , యశ్ చోప్రా, లతా మంగేష్కర్, మృణాల్ సేన్, అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నాలు అందుకున్నారు.