విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు
మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది.
By అంజి Published on 20 Nov 2024 6:46 AM IST
విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు
మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఈ జంట విడిపోవాలనే నిర్ణయానికి సంబంధించి సైరా లాయర్ వందనా షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. “పెళ్లయిన చాలా సంవత్సరాల తర్వాత, సైరా తన భర్త ఏఆర్ రెహమాన్ నుండి విడిపోవాలని కష్టమైన నిర్ణయం తీసుకుంది. వారి సంబంధంలో ముఖ్యమైన భావోద్వేగ ఒత్తిడి తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. ఒకరికొకరు గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, ఈ జంట ఉద్రిక్తతలు, ఇబ్బందులు తమ మధ్య అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని కనుగొన్నారు. సైరా తీవ్ర మనో వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్ఘాటించారు. ఈ సమయంలో వారి గోప్యతను గౌరవించాలని సైరా అభ్యర్థించింది” అని వందనా షా ప్రకటన రిలీజ్ చేశారు.
1995లో వివాహం చేసుకున్న వీరిద్దరూ ఖతీజా, రహీమా మరియు అమీన్ అనే ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు. భార్యతో విడాకులు తీసుకోవడంపై ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు. ''మేము మా బంధంలో ముప్పై ఏళ్లు పూర్తి చేసుకోవాలనుకున్నాం. కానీ ఊహించని విధంగా ఇది ముగిసింది. విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుంది. విడిపోవడంలోనూ మేము అర్థాన్ని వెతుకుతాము. అయినప్పటికీ పగిలిన ముక్కలు మళ్లీ ఒక్కటి కాలేకపోవచ్చు. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించినందుకు అందరికీ ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు. వర్క్ ఫ్రంట్‌లో, రెహమాన్ చివరి ప్రాజెక్ట్ ధనుష్ రెండవ దర్శకత్వం వహించిన రాయన్. తర్వాత ఛావా, థగ్ లైఫ్, గాంధీ టాక్స్ తదితర చిత్రాలకు సంగీతం అందించనున్నాడు.