షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో సన్నిహితంగా ఉండే అనన్య పాండేను ఎన్సీబీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. గురువారం షారుక్ నివాసం 'మన్నత్'లో సోదాలు నిర్వహించారు. అనన్య పాండే ఇంట్లోనూ సోదాలు చేశారు. ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను సీజ్ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా అనన్యకు నోటీసులిచ్చారు. గురువారం ఆమెను సుదీర్ఘంగా విచారణ చేసి శుక్రవారం కూడా విచారణకు రావాలని పిలిచారు. గురువారం దాదాపు రెండున్నర గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారు.
ఆర్యన్‌తో వాట్సాప్ చాట్ గురించి అనన్యను ప్రశ్నించారట. వీరిద్దరి మధ్య గంజాయి కోసం వాట్సాప్ చర్చ జరిగిందని ఎన్‌సీబీ అధికారులు గుర్తించారని కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ తెలిపాయి. గంజాయి కోసం ఆర్యన్ అడగ్గా.. ఏర్పాటు చేస్తానని అనన్య చెప్పినట్లు ఆ చాట్ లో ఉందని.. ఈ చాట్‌ను చూపించి అధికారులు ప్రశ్నించగా.. తాను కేవలం జోక్ చేశానని అనన్య చెప్పినట్లు మీడియాలో వచ్చాయి. తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, ఎవరికీ సరఫరా చేయలేదని ఆమె చెప్పినట్లు తెలిసింది. అయితే ఆర్యన్ కోసం అనన్య డ్రగ్స్ పంపించినట్లు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని తెలుస్తోంది.